తెలంగాణ

telangana

ETV Bharat / international

'పక్షపాత వైఖరి, ఓటు బ్యాంకు కోణం'- అమెరికా నివేదికను ఖండించిన భారత్‌ - India On US Report - INDIA ON US REPORT

India On US Religious Freedom Report : 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ'పై అమెరికా విడుదల చేసిన నివేదికను భారత్​ ఖండించింది. ఈ నివేదిక పూర్తి పక్షపాతం, ఓటు బ్యాంక్​ కోణంలో రూపొందించినట్లు పేర్కొంది.

INDIA ON US REPORT
INDIA ON US REPORT (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 10:43 PM IST

India On US Religious Freedom Report :మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ అమెరికా విడుదల చేసిన నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడి ఉందని విమర్శించింది. అమెరికా ఈ నివేదికను ఓటు బ్యాంకు కోణంలో రూపొందించినట్లు కనిపిస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తీవ్రంగా దుయ్యబట్టారు.

'గతంలో మాదిరిగానే ఈ 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' నివేదిక పక్షపాతంతో కూడి ఉంది. దీనిలో భారత సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కొరవడింది. స్పష్టంగా ఓటు బ్యాంకు లెక్కలు కనిపిస్తున్నాయి. అనేక అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు వివరణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని అంశాలనే ఎంచుకోవడం, పక్షపాత అంశాలపై ఆధారపడటం, ఒకే కోణాన్ని చూపించడం లాంటివి ఈ నివేదికలో పొందుపరిచారు' అని జైశ్వాల్​ పేర్కొన్నారు. 'భారత వ్యతిరేక కథనాన్ని చిత్రీకరించేందుకు కొన్ని ఘటనలనే ఈ నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు భారత చట్టాలు, నిబంధనల చెల్లుబాటును కూడా ప్రశ్నించింది. భారత న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పుల విశ్వసనీయతను కూడా సవాలు చేసేలా ఈ నివేదిక ఉంది' అని జైశ్వాల్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం
భారతదేశంలో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యానించింది. మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను, ప్రార్థనా స్థలాలను కూల్చివేయడం కూడా ఇబ్బందికరమేనని అభిప్రాయపడింది. 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ'పై బుధవారం నివేదిక విడుదల చేసిన సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

'భారత్‌లోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను కూడా విధిస్తున్నాయి. దీనిపై అమెరికన్​ అధికారులు ఎప్పటికప్పుడు భారత్‌ ఆధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు' అని అమెరికా విడుదల చేసిన నివేదికలో ఉంది.

దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూపు!
తమ దేశంలో జరిగిన ఖలిస్థాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను హత్య కేసులో భారత్‌ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ హత్యలో భారతదేశానికి చెందిన నిఖిల్‌ గుప్తా ప్రమేయం ఉందని అమెరికా అధికారులు గత నవంబరులో అభియోగాలు మోపారు. అంతేకాదు గత జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌లో నిఖిల్‌ను అరెస్టు చేసి అమెరికాకు తీసుకెళ్లారు. 'ఈ కేసులో విచారణ జరుపుతున్నామని భారత్‌ అధికారులు తెలిపారు. ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం' అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి బుధవారం వాషింగ్టన్‌లో వ్యాఖ్యానించారు.

ఇరుదేశాల సంబంధాలు మరింత విస్తృతం
భారత్, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా ఉన్నాయని, అవి మరింత విస్తృతమవుతున్నాయని ఇండియాలోని అమెరికన్​ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇంత దగ్గరగా ఈ ఇరుదేశాలు లేవని, అమెరికాలో భారతీయులు 1.5 శాతం ఉన్నారని, వారు దేశ పన్నుల్లో 6 శాతం వరకు చెల్లిస్తున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన వలస వర్గమని ఎరిక్​ గార్సెట్టీ వ్యాఖ్యానించారు.

దిల్లీలో ఎటు చూసినా నీరే- ఎంపీని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టిన నాయకులు- రామ్ గోపాల్​ ఆవేదన! - Delhi Rainfall

బైడెన్, ట్రంప్​ మాటల యుద్ధం- లైవ్​​ డిబేట్​లో వాడివేడిగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ - Trump Biden Presidential Debate

ABOUT THE AUTHOR

...view details