China Taiwan Conflict :తైవాన్‌లో కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ద్వీప దేశాన్ని కవ్విస్తున్న చైనా, ఆ చర్యలను మరింత ఉద్ధృతం చేసింది. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలను తైవాన్ తీరాలకు డ్రాగన్ పంపింది. 49 యుద్ధవిమానాలు, 19 నౌకాదళ నౌకలు, అలాగే కోస్టుగార్డు నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణశాఖ వెల్లడించింది. సుమారు 35 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి మధ్యభాగంపై చక్కర్లు కొట్టినట్లు తెలిపింది.
తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గురువారం కూడా తైవాన్ తీర ప్రాంతాల్లో చైనా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద శక్తులను శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది. తైవాన్ నియంత్రణలో ఉన్న కిన్‌మెన్, మాట్సు ద్వీప సమూహాల్లో చైనా చట్టాలను అమలు చేసేందుకు, డ్రిల్‌ల నిర్వహణకు ఒక నౌకాదళాన్ని ఏర్పాటు చేసినట్లు చైనా తీర రక్షక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో తైవాన్ కూడా అప్రమత్తమైంది. యుద్ధవిమానాలు, రాడార్లు, నౌకలు, ఇతర ఆయుధ నిరోధక వ్యవస్థలతో గస్తీని కట్టుదిట్టం చేసింది. చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో టయోయువాన్‌లోని ఆర్మీ బేస్‌ను కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లై చింగ్-తె సందర్శించారు. తైవాన్ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్‌గా జాతీయ భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. చైనా అహేతుక రెచ్చగొట్టే చర్యల వల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రమాదంలో పడిందన్నారు.