China Highway Collapse:దక్షిణ చైనాలోని గ్యాంగ్‌డాంగ్‌లో హైవే కుప్పకూలడం వల్ల సుమారు 24 మంది మరణించారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ధ్రువీకరించింది. హైవేలో ఒక భాగం కుప్పకూలిందని తెలిపింది. అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇదే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. హైవే కింద చిక్కుకుపోయిన సుమారు 30మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆస్పత్రులకు తరలించారు. హైవేను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వర్ష బీభత్సం వల్లేనా?
గ్వాంగ్‌డాంగ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా నలుగురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. గ్వాంగ్‌డాంగ్ రాజధాని గ్వాంగ్‌జౌ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పెరల్ నది దిగువన ఉన్న పెరల్ రివర్ డెల్టాలో పెద్ద ప్రాంతం కూడా నీటిలో మునిగిపోయింది. ఈ వర్షం దెబ్బకి దాదాపు 1.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 26 వేల మందిని షెల్టర్ హోమ్‌లకు పంపారు. ఏప్రిల్ నెలలో గ్వాంగ్‌జౌలో 60.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.