China Earthquake Today :చైనాను భారీ భూకంపం కుదిపేసింది. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ధాటికి పలు భవనాలు కంపించాయి. ఈ భూకంపం వల్ల ఆరుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 120 భవనాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దిల్లీలో ప్రకంపనలు
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. సుమారు 200 మంది రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్రంగా, మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో 47 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 78 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం వుషీ కౌంటీలోని ఓ టౌన్‌షిప్ పరిధిలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. తర్వాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించినట్లు వివరించింది. భూకంప కేంద్రం చైనా, కిర్గిజిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో దిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి.