Canada Study Permit : కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు కెనడా సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న వాటిలో మూడో వంతు అనుమతులపై కోత పెట్టనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఇళ్ల కొరతకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దం క్రితంతో పోలిస్తే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం సుమారు 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023తో పోలిస్తే ఇది 35 శాతం కంటె తక్కువని, అలానే 2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని మిల్లర్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపర్చి వారికి ఉన్నతమైన విద్యను అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే కావాల్సిన నివాసాలను అందుబాటులో ఉంచడం కూడా ఓ కారణమని వివరించారు. ఇక్కడికి వచ్చే వారందరికీ సరైన వనరులు అందివ్వకపోవడం సమంజసం కాదని తాము భావిస్తున్నామన్నారు. వచ్చిన వారిని నిరాశతో సొంత దేశానికి తిరిగి వెళ్లడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.