Attack On Hindu Temple In Canada :కెనడాలోని సిక్కు వేర్పాటువాదులు బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో జరిగిన భక్తుల దాడి ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర అమెరికాలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్ హిందూ మహాసభ ఆలయం వెలుపల భారీ ర్యాలీ నిర్వహించారు. కెనడా, భారత్ జెండాలతో సోమవారం రాత్రి వేలాదిమంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
"హిందూ దేవాలయాలపై పెరుగుతున్న ఆకస్మిక దాడులకు నిరసనగా బ్రాంప్టన్‌లో వెయ్యి మందికి పైగా కెనడియన్ హిందువులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ హిందూ ఫోబియా తగదని, ఇలాంటి దాడుల్ని కట్టడి చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని హిందూ సంఘాలు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చాయి.
మరోవైపు ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. "కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ దృఢనిశ్చయాన్ని బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టబద్ధ పాలనను నిలబెడుతుందని మేం ఆశిస్తున్నాం" అని పోస్టు పెట్టారు.
భారత వ్యతిరేక శక్తుల హస్తం: హైకమిషన్
ఆదివారం జరిగిన దాడి వెనక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భద్రత అందించాలని తాము ముందుగానే కెనడా అధికారులను అభ్యర్థించామని తెలిపింది. భారత వ్యతిరేక శక్తుల దాడితో క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని చెప్పింది. ఈ చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని భారత హై కమిషన్ ఎక్స్ వేదికగా తెలిపింది.
మరోవైపు, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై అక్కడి మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖలిస్థానీ మద్దతుదారుల విషయంలో ప్రధాని వ్యవహారంపై మండిపడిన ఆయన, సామాజికంగా, రాజకీయంగా ట్రూడో ఒక ఇడియట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడా విలువల కంటే గుర్తింపు రాజకీయాలకే ట్రూడో ప్రాధాన్యం ఇస్తారని, గతంలో ట్రూడోతో చర్చలు జరిపిన విషయాన్ని ఉజ్జల్ దోసంజ్ గుర్తుచేసుకున్నారు