Bombing At Iraq Military Base :పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాక్‌లోని ఓ ఇరాన్ అనుకూల సైనిక స్థావరంపై ఐదు దాడులు జరిగాయి. కాల్సోబేస్‌పై జరిగిన ఈ దాడుల్లో హషద్ అల్‌షాబీ గ్రూపునకు చెందిన ఒకరు చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐసిస్ ఉగ్రసంస్థకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ గ్రూపు ఇరాక్‌లో పనిచేస్తోంది. అయితే ఈ సైనిక స్థావరంపై దాడి చేయడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టంచేసింది. కాగా ఇస్ఫహాన్ నగరంపై దాడి చేసింది ఇజ్రాయెలే అని తేలితే, ఆ దేశం తీవ్ర ప్రతీకార దాడులను ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది.
'దాడి చేసింది డ్రోన్లు కాదు- ఆటబొమ్మలే!'
ఇదిలా ఉంటే, శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్ ప్రతీకార దాడేనంటూ అమెరికా పేర్కొంది. కానీ టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించిన డ్రోన్లు తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరికల జారీ చేశారు.
అమెరికాలోని న్యూయార్క్ పర్యటనలో ఉన్న హొస్సేన్, అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడారు. "శుక్రవారం జరిగింది దాడే కాదు. అవి డ్రోన్లు కాదు, మా పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లా ఉన్నాయి. మా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేం ప్రతిచర్యకు దిగట్లేదు. కానీ ఒకవేళ ఆ దేశం మాకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం, మా ప్రతిస్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుంది. దానికి వాళ్లు పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది" అని నెతన్యాహు సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు.