తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి - 47 మంది సైనికులు మృతి, 30 మందికి గాయాలు! - BLA ATTACK ON PAK ARMY CONVOY

బెలూచిస్తాన్‌లోని తుర్బత్ నగర శివార్లలో ఆత్మాహుతి దాడి - చేసింది తామేనని ప్రకటించిన బీఎల్‌ఏ

Suicide blast in Pakistan
Suicide blast in Pakistan (ANI (Representative Image))

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2025, 7:55 AM IST

BLA Attack On Pak Army Convoy : పాకిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. శనివారం రోజు బెలూచిస్తాన్‌లోని తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మృతిచెందగా, 30 మందికిపైగా జవాన్లు గాయపడ్డారంటూ బెలూచిస్తాన్ పోస్ట్ సంచలన వార్తను ప్రచురించింది. బీఎల్‌ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ అనే ఫిదాయీ యూనిట్ ఈ ఆత్మాహుతి దాడి చేసిందని వార్తలో ప్రస్తావించింది. ఈ దాడి వివరాలను బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయంద్ బెలూచ్ తమకు తెలియజేశారని కథనంలో బెలూచిస్తాన్ పోస్ట్ పేర్కొంది. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ‘ఫిదాయీ సంగత్ బహర్ అలీ’గా గుర్తించారు. అతడు తుర్బత్ నగరంలోని దష్త్ హోచత్ ఏరియాకు చెందినవాడని బీఎల్ఏ వర్గాలు వెల్లడించాయి. 2017 నుంచి అతడు బెలూచిస్తాన్ నేషనల్ మూవ్‌మెంట్‌లో పనిచేస్తున్నాడని, 2022లో ఫిదాయీ మిషన్‌లో భాగమయ్యాడని తెలిపాయి.

ఒక బస్సు, ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసం
‘‘తుర్బత్ నగరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని బెహ్మన్ ఏరియాలో శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై మేం దాడి చేశాం. ఆ కాన్వాయ్‌లో మొత్తం 13 వాహనాలు ఉన్నాయి. వాటిలో 5 బస్సులు, 7 సైనిక వాహనాలు ఉన్నాయి. అవన్నీ కరాచీ నుంచి తుర్బత్ నగరంలో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వైపుగా వెళ్తుండగా ఈ దాడి చేశాం. దీంతో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమవగా, మిగతా బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌లో ఐంఐ 309 వింగ్, ఎఫ్‌సీ ఎస్ఐ‌యూ వింగ్, ఎఫ్‌సీ 117 వింగ్, ఎఫ్‌సీ 326 వింగ్‌లకు చెందిన సిబ్బందితో పాటు రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జోయబ్ మొహసిన్ (ప్రస్తుత పోలీసు అధికారి) ఉన్నారు’’ అని జీయంద్ బెలూచ్ తెలిపినట్లుగా కథనంలో రాసుకొచ్చారు. తమ ఇంటెలీజెన్స్ విభాగం జిరాబ్ నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో ఈ దాడి చేశామని జీయంద్ బెలూచ్ తెలిపారు. బెలూచిస్తాన్ గడ్డ పాకిస్తాన్ ఆర్మీకి సురక్షితమైంది కాదని ఈ దాడి ద్వారా నిరూపించామన్నారు. కాగా, తుర్బత్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 11 మందే చనిపోయారని పాక్ అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. సైనికుల మరణాల సంఖ్య పెరిగినట్టుగా పాక్ సైనిక అధికార వర్గాలు కొత్త వివరాలేవీ ఇంకా విడుదల చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details