Biden Pardons Son Hunter : అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో దోషిగా తేలిన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించుకున్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆదివారం ఓ ప్రకటను విడుదల చేశారు.
"ఈ రోజు నా కుమారుడు హంటర్ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశాను. వాస్తవానికి నా కుమారుడిపై నమోదైన కేసులు అన్నీ రాజకీయంగా ప్రేరేపితమైనవి" అని బైడెన్ పేర్కొన్నారు. వాస్తవానికి జో బైడెన్ కుమారుడైన హంటర్ అక్రమ ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో దోషిగా తేలాడు. దీంతో పాటు ఆదాయ పన్ను విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడనే నేరారోపణలు కూడా ఉన్నాయి. డెలావర్, కాలిఫోర్నియాల్లో హంటర్‌పై ఈ కేసులు నడుస్తున్నాయి.
మాటతప్పిన బైడెన్
అమెరికా అధ్యక్షుడికి అసాధారణ అధికారాలు ఉంటాయి. అయితే వీటిని తన కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోనని గతంలే బైడెన్ పేర్కొన్నారు. డెలావర్, కాలిఫోర్నియా కేసుల్లో తన కుమారుడు దోషిగా తేలినా, అతనిని క్షమించనని, అతనికి పడిన శిక్షను కూడా మార్చనని జో బైడెన్ గతంలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ మాట తప్పారు. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని బైడెన్ వినియోగించుకున్నారు.
మరి జే6 బందీల సంగతేంటి?
బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించడంపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. "న్యాయవ్యవస్థలోని లోపం వల్ల తన కుమారుడికి శిక్ష పడిందని బైడెన్ అంటున్నారు. మరి సంవత్సరాల తరబడి జైలులో ఉన్న జే-6 బందీలను కూడా విడిచిపెడతారా?" అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ ప్రశ్నించారు.
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ వద్ద ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. కానీ వీరిలో ఓ ఆరుగురు వ్యక్తులను - అల్లర్లకు పాల్పడ్డారని పేర్కొంటూ ఖైదు చేశారు. వారు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. బైడెన్ వారికి ఎలాంటి క్షమాభిక్ష ప్రసాదించలేదు. దీనిపై ట్రంప్ మండిపడుతున్నారు. బహుశా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది.
ట్రంప్ వియ్యంకుడికి కీలక పదవి
త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ తన వియ్యంకుడికి కీలక పదవి అప్పగించారు. మసాద్ బౌలోస్‌ను పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా ట్రంప్ నియమించారు. ఆయన అరబ్, మధ్యప్రాచ్య వ్యవహారాలకు సంబంధించి, అమెరికా అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా పనిచేస్తాని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ వెల్లడించారు. మసాద్ బౌలోస్ ట్రంప్ కుమార్తె టిఫానీకి మామ కావడం గమనార్హం.
లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ బౌలోస్, గాజా అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లను ట్రంప్ వైపునకు మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయనకు ట్రంప్ కీలక పదవి అప్పగించినట్లు తెలుస్తోంది.