Bangladesh Comments On PM Modi Vijay Diwas post :డిసెంబర్ 16న విదయ్ దివస్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పెట్టిన పోస్టును బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ తప్పుబట్టారు. ఈ విషయంపై తాను నిరసన తెలియజేస్తున్నానన్నారు. ఆ విజయంలో భారత్ కేవలం మిత్రదేశమే తప్ప మరేమీ కాదన్నారు. నజ్రుల్ చేసిన వ్యాఖ్యలను మహ్మద్ యూనస్ కార్యాలయం రీపోస్ట్ చేసింది.
మరోవైపు, యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా సైతం మోదీ పెట్టిన పోస్ట్‌పై విమర్శలు చేశారు. "ఈ స్వాతంత్య్రాన్ని భారత్ తమ విజయంగా చెప్పుకోవడం, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్యం, ఏకత్వానికి ముప్పుగా నేను భావిస్తున్నాను. భారత్ వైపు నుంచి వస్తున్న ఈ ముప్పునకు వ్యతిరేకంగా పోరాడటం మనకు అవసరం. మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలి." అని హస్నత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మోదీ పోస్ట్ ఇదే!
"ఈరోజు విజయ్ దివస్. 1971 యుద్ధంలో భారత్ చారిత్రక విజయానికి దోహదపడిన ధైర్యవంతులైన సైనికుల త్యాగాలను మేము గౌరవిస్తాము. వారి నిస్వార్థ అంకితభావం, అచంచలమైన సంకల్పం మన దేశాన్ని రక్షించాయి. మనకు కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ రోజు- వారి అసాధారణ పరాక్రమానికి, అచంచలమైన స్ఫూర్తికి నివాళి. వారి త్యాగాలు తరతరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి." అని విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యూనస్ ప్రసంగం- భారత్ ప్రస్తావనే లేదు!
విజయ్ దివస్ సందర్భంగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని జాతీయ స్మారకం వద్ద ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్, అధ్యక్షుడు మహమ్మద్ షాహబుద్దీన్ విమోచన యుద్ధ వీరులకు విడివిడిగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి యూనస్ చేసిన ప్రసంగం టీవీలో ప్రసారమయ్యింది. దేశ విముక్తికి యువత సహా ఎందరో ప్రజలు త్యాగాలు చేశారని పేర్కొన్నారు. అయితే, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బంగ బంధు ముజిబుర్ రహ్మాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. బంగ్లాదేశ్ విమోచనానికి ప్రధాన కారణమైన భారత్ పేరును కూడా యూనస్ ప్రస్తావించలేదు. అంతేకాకుండా పాక్ వ్యతిరేక పోరాటంలో బెంగాలీ గెరిల్లాలకు భారత్ చేసిన సహాయాన్ని కూడా యూనస్ ప్రస్తావించలేదు.
పాకిస్థాన్ నడ్డివిరిచి ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించింది. 90 వేలకు పైగా పాకిస్థాన్ సైనికులు ఇండియన్ ఆర్మీ ఎదుట లొంగిపోయారు. అది బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది.