Ahlan Modi Event PM Modi Speech :యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, భారత్ అభివృద్ధి భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల బంధం క్రమంగా బలపడుతూ కొత్త శిఖరాలకు చేరుతోందని చెప్పారు. ఈ బంధం ఇలాగే బలోపేతం కావాలన్నది భారత్ ఆకాంక్ష అని అన్నారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో నిర్వహించిన అహ్లాన్ మోదీ కార్యక్రమానికి హాజరైన ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏఈలో ఉన్న భారత సంతతి ప్రజలను చూసి 140 కోట్ల మంది భారత ప్రజలు గర్విస్తున్నారని పేర్కొన్నారు.
"యూఏఈతో బంధం ప్రతిభ, సంస్కృతి, ఆవిష్కరణలతో కూడుకున్నది. గతంలో మనం ఇరుదేశాల సంబంధాలను అన్ని దిశల్లో బలోపేతం చేసుకున్నాం. కలిసి నడిచాం. కలిసి ముందుకెళ్లాం. ఇప్పుడు యూఏఈ భారత్కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏడో అతిపెద్ద పెట్టుబడిదారు. సులభతర జీవనం, సులభతర వాణిజ్యంలో ఇరుదేశాల మధ్య సహకారం ఎనలేనిది. ఈరోజు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు కూడా ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మన ఆర్థిక వ్యవస్థలు ఏకమవుతున్నాయి. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో మన బంధం బలోపేతం అవుతోంది. సామాజిక, సాంస్కృతిక అంశాల్లో ఇరుదేసాలు సాధించిన విజయాలు ప్రపంచానికి ఓ మోడల్."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కార్యక్రమానికి వచ్చిన ప్రజలపై ప్రశంసలు కురిపించారు మోదీ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు చరిత్ర సృష్టించారని అన్నారు. సభికులు యూఏఈ, భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారైనప్పటికీ అందరి మనసుల్లోనూ ఇరుదేశాల స్నేహం వర్ధిల్లాలనే ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. 2015లో తొలిసారి యూఏఈ పర్యటనకు వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల తర్వాత ఓ భారత ప్రధాని యూఏఈకి రావడం అదే తొలిసారని చెప్పారు. గత పదేళ్లలో యూఏఈకి తాను రావడం ఇది ఏడోసారని మోదీ తెలిపారు. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జయేద్' తనకు దక్కడంపై మాట్లాడిన ఆయన- ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమని పేర్కొన్నారు.