తెలంగాణ

telangana

ETV Bharat / international

వరల్డ్ టెంపరేచర్ రికార్డులను బద్దలుకొట్టిన '2023'- ఇది ప్రపంచానికి రెడ్​ అలర్ట్! - 2023 Highest Global Temperature

2023 Record Highest Global Temperature : 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీనదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా పాటు సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది.

2023 Record Highest Global Temperature
2023 Record Highest Global Temperature

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 10:12 PM IST

2023 Record Highest Global Temperature :2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్య రాజ్య సమితి నిర్ధరించింది. అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ఒక దశాబ్దాన్ని 2023 పూర్తి చేసిందని వెల్లడించింది. ఈ దశాబ్ద కాలంలో హిమనీనదాలు కరగడం, సముద్రాల్లో నీరు వేడెక్కడం, అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం వంటివి రికార్డు స్థాయిలో నమోదయినట్లు ఐరాస ప్రపంచ వాతావరణ విభాగం వార్షిక నివేదికలో పేర్కొంది.

2023 సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి గల సంవత్సరంగా, అలాగే ఆ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రత ఉన్న దశాబ్దంగా తేల్చింది. ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధన వినియోగం పెరుగుదలే దీనికి కారణమని, వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయనీ ఈ భూగ్రహం మనకు ఒక విపత్తు సందేశాన్ని పంపుతోందని చెప్పారు.

గతేడాది సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.45 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ ఉందనీ ఇది ప్రమాదకరంగా భావిస్తున్న 1.5 డిగ్రీల సెల్సియస్‌కు అతి చేరువలో ఉందని WMO నివేదిక తెలిపింది. పారిస్ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీల దిగువ పరిమితికి ఇంత చేరువకు రావడం ఇదే తొలిసారని ప్రకటించింది. ఇది ప్రపంచానికి ఒక రెడ్‌ అలెర్ట్‌ అని పేర్కొంది. 2023లో సముద్ర భాగంలోని 90శాతానికి పైగా ఏదో ఒక సమయంలో హీట్‌వేవ్‌ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇలాంటివి తరచూ సంభవిస్తే సముద్ర పర్యావరణ వ్యవస్థలు, పగడపు దిబ్బలకు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించింది. 1950 నుంటి ఇప్పటి వరకు

ప్రపంచంలోని ప్రముఖ హిమానీనదాలు అత్యధిక మంచు కరిగే నష్టాన్ని చవి చూశాయని వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని ఆల్పైన్ హిమానీనదాలు గత రెండేళ్లలోనే వాటి మొత్తం పరిమాణంలో 10 శాతం కోల్పోయాయని తెలిపింది. మంచు ఫలకాలు తగ్గడం వల్ల గతంలో ఎన్నడూ లేనంత సముద్ర మట్టాలు కూడా పెరిగాయని హెచ్చరించింది. గణాంకాలు మొదలైన 1930ల తర్వాత దశాబ్దంతో పోలిస్తే 2014 నుంచి 23 వరకు సముద్రనీటి మట్టం రెట్టింపు స్థాయిలో పెరిగిందని వెల్లడి చేసింది.

వాతావరణ మార్పులు ప్రపంచంలో వరదలు, కరవుకు ఆజ్యం పోస్తున్నాయని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని WMO తెలిపింది. జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతోందని, అటు ఆహార భద్రతకు ముప్పు పెరిగిందని వివరించింది. కొవిడ్-19కి ముందు 149 మిలియన్ల మంది ప్రజలు ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటే 2023 చివరినాటికి అది 333 మిలియన్లకు చేరిందని ఉదాహరించింది. అయితే ఇదే సమయంలో సౌర, పవన జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి 50 శాతం పెరగడం ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details