World Oral Health Day 2024 :నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే నానుడి అందరికీ తెలిసిందే. అయితే నోరు బాగుంటే ఊరు బాగుంటుందో లేదో తెలియదు కానీ మీ ఆరోగ్యం మాత్రం కచ్చితంగా బాగుంటుందని అంటున్నారు వైద్యులు. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుందని, అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయని వైద్యులు వివరిస్తున్నారు. నోటి పరిశుభ్రత గురించి, పళ్లు తోముకోవడం గురించి, నోటి పరిశుభ్రత లోపిస్తే తలెత్తే సమస్యల గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం మన నోటిని ప్రభావితం చేస్తుంది. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో విఫలమైతే చిగుళ్ల వ్యాధి, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి అనేక రోగాలకు దారితీస్తుందని వైద్యులు చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యపరంగా చాలా లాభాలు పొందవచ్చు.
అలాంటి బ్రష్‌నే వాడాలి!
మనలో చాలామంది బ్రష్ ఎలాంటిది తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకుండా ఉంటారు. నోట్లోని అన్ని మూలలకు బ్రష్ వెళ్లగలిగే బ్రష్‌ను వాడటం వల్ల మేలు కలుగుతుందని గుర్తించాలి. చాలామంది ఉదయం పూట ఎక్కువ సేపు లేదంటే గట్టిగా బ్రష్ చేస్తుంటారు. నిజానికి ఎక్కువ సేపు లేదంటే గట్టిగా బ్రష్ చెయ్యడం వల్ల పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఫలితంగా చల్లని లేదా వేడి పదార్థాలు తినే సమయంలో దంతాలు జుమ్మని లాగడం జరగవచ్చు. ఇలాంటి నొప్పి ఉన్న వాళ్లు యాంటీ సెన్సిటివిటీ ఉన్న టూత్ పేస్టులు వాడితే మంచిది. అలాగే దంతాలు తెల్లగా ఉండటానికి వైటెనింగ్ టూత్ పేస్టులు వాడాలి. కానీ ఇలాంటి పేస్టులను దంత వైద్యుల సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోండి.
నిర్లక్ష్యం వద్దు
బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం లేదంటే ఇతర కారణాల వల్ల చాలామందికి చిగుళ్ల నొప్పి తలెత్తుతుంది. అయితే చిగుళ్ల నొప్పి అనేది నోటిలో మొదలై రక్త నాళాల ద్వారా గుండెకి, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్గా మారి జాయింట్స్‌కు, ఆర్థరైటిస్‌కు ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. అలాగే బ్రష్ వెళ్లలేని నోటిలోని ప్రదేశాలను శుభ్రం చేయడానికి మౌత్ వాష్లను వాడటం ఉత్తమం.