Why Women are Less Happy Compared to Men:మహిళలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారు. అయినప్పటికీ వారు సంతోషంగా ఉండటం లేదట! మీరు విన్నది నిజమే. పురుషులతో పోలిస్తే.. స్త్రీలు తక్కువ సంతోషంగా ఉంటున్నారట! మరి దానికి కారణాలు ఏంటి? ఈ సమస్యను ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కుటుంబ బాధ్యతలు:ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇంటి బాధ్యత మొత్తం మహిళలే చూస్తున్నారు. పిల్లల ఆలనాపాలనా మొదలు.. పెద్దల ఆరోగ్యం విషయం వరకూ అన్నీ వారే చూస్తుంటారు. ఇంటి పనులన్నీ వారే చేస్తుంటారు. ఈ కారణంగా వారు ఎక్కువగా అలసిపోతున్నారని.. నిత్యం మనసులో ఏదో ఒక పని గురించి ఆలోచిస్తూ టెన్షన్లో ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
వేధింపులు:కొందరు మహిళలు ఇంట్లో పనులు చేసుకొని ఉద్యోగాలకు వెళ్తుంటారు. అయితే.. పని ప్రదేశంలో వారిపై వేధింపులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. స్త్రీలకు సరైన భద్రత ఉండటం లేదు. ఉద్యోగాలు చేసే వారితోపాటు చదువుకునే వారైనా, ఇంట్లో ఉండే వారైనా లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యంతరకరమైన మాటలు, వెకిలి చేష్టలతో వాళ్లు మానసికంగా నలిగిపోతున్నారట.
జీతాలు తక్కువ: చాలా సంస్థల్లో పురుషులతో పోలిస్తే స్త్రీలకు వేతనాలు తక్కువగా ఉంటాయి. ఇద్దరుచేసే పని ఒకటే అయినా జీతాలు మాత్రం స్త్రీ, పురుషులకు వేరుగా ఉంటున్నాయి. ఈ విషయం వారిని వేధిస్తుంది. అంతేకాకుండా.. ఇంట్లోని పేదరికం, ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇవన్నీ మహిళల సంతోషాన్ని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
లింగ వివక్ష: ఇప్పటికీ మహిళలు లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. అది ఉద్యోగం, వ్యాపారం.. ఏ విషయంలోనైనా సరే.. వారు చాలా వరకు వివక్షను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతో చాలా మంది తాము కోరుకున్న లైఫ్‌ను అనుభవించలేక సంతోషాలకు దూరమవుతున్నారట.
ఒత్తిడి:పై అంశాలతోపాటు పలు రకాల కారణాలతోమహిళలు అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారట. పురుషులతో పోలిస్తే.. ఈ ఒత్తిడి మహిళల్లో అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో Pew Research Center నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. అమెరికన్ మహిళలు పురుషుల కంటే 42శాతం ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో Pew Research Centerలో హెల్త్ అండ్ వెల్‌బీయింగ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్. కారెన్ డి. మోర్గన్ పాల్గొన్నారు.