Om Prakash Chautala Last Rites : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా అంత్యక్రియలు శనివారం జరిగాయి. చౌతాలా సొంత జిల్లా శిర్సాలోని వ్యవసాయ క్షేత్రం తేజా ఖెడాలో మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీతో పాటు పలువురు నేతలు చౌతాలా భౌతికకాయానికి నివాళులర్పించారు.
గురుగ్రామ్‌లోని తన నివాసంలో ఓం ప్రకాశ్ చౌతాలా గురువారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను మేదాంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే హరియాణా ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపదినాలను, అన్ని కార్యాలయాలకు శనివారం సెలవును ప్రకటించింది.
ఓం ప్రకాశ్ చౌతాలా ప్రస్థానం
- హరియాణాలో చౌతాలా కుటుంబం చాలా పేరున్న రాజకీయ కుటుంబం.
- మాజీ ప్రధాని చౌదరీ దేవీలాల్ ఐదుగురు సంతానంలో ఓం ప్రకాశ్ చౌతాలా పెద్దవారు.
- ఓం ప్రకాశ్ చౌతాలా 1935 జనవరి 1న జన్మించారు.
- ఓం ప్రకాశ్ చౌతాలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య స్నేహ లత ఐదేళ్ల క్రితమే చనిపోయారు.
- ప్రాథమిక విద్య తరువాత చౌతాలా చదువు మానేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం సమయంలో ఆయన తిహాఢ్ జైలుకు వెళ్లారు. అప్పుడే 82 ఏళ్ల వయస్సులో ఆయన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
- 2021లో జైలు నుంచి విడుదలైన ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
- చౌతాలా పెద్ద కుమారుడైన అజయ్ సింగ్ చౌతాలా కూడా టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో నేరస్థుడిగా తిహాఢ్ జైలుకు వెళ్లారు. తరువాత ఆయన ఎంపీ కూడా అయ్యారు. తరువాత తమ పార్టీతో విభేదించి 2018 డిసెంబర్‌లో జననాయక్ జనతా పార్టీని స్థాపించారు. ఈయన కుమారులు దుష్యంత్, దిగ్విజయ్ జేజేపీ పార్టీ నేతలుగా కొనసాగుతున్నారు. వీరిలో దుష్యంత్ చౌతాలా హరియాణా ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.
- చౌతాలా చిన్న కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయన కుమారుడు అర్జున్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
- చౌతాలాకు చెందిన ఐఎన్‌ఎల్‌డీ పార్టీ గతంలో బీజేపీతో కలిసి పనిచేసింది. 2005 నుంచి ఆ పార్టీ - అధికారానికి దూరంగానే ఉంది.