Why Women Get Less Heart Attacks: మగవారికంటే మహిళల గుండె గట్టిదని మనలో చాలా మంది అనుకుంటారు. అందుకే వారికి గుండె సంబధింత సమస్యలు తక్కువగా వస్తాయని భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం వాళ్ల గుండె కూడా బలహీనంగానే మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులు, ఆహార అలవాట్లు, శారీరక మార్పులతో గుండెపోటుకు గురవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో గుండెజబ్బులు అధికంగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల్లో గుండె జబ్బుల తీవ్రత గురించి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రవీంద్ర దేవ్ వెచ్చాలపు చెబుతున్నారు.
"మగవారితో పోలిస్తే మహిళల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు కొంతవరకు తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా 45ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో పురుషులతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ 60 ఏళ్లు దాటాక.. పురుషులతో సమానంగా ప్రమాదం పెరుగుతుంది. మహిళల్లోని ఈస్ట్రోజన్ హర్మోన్ ఇందుకు కారణం. ఇది కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తం గడ్డకట్టే గుణాన్ని తగ్గించి గుండెను కాపాడుతుంది. 45 ఏళ్లు దాటిన తర్వాత వీరిలో హర్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి."
--డాక్టర్ రవీంద్ర దేవ్ వెచ్చాలపు, కార్డియాలజిస్టు
ముఖ్యంగా మెనోపాజ్ దాటిన తర్వాత మహిళలల్లో రక్తనాళాలు పూడుకుపోవడంతో గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మహిళలు నడుస్తున్నపుడు, మెట్లు ఎక్కుతున్నపుడు ఆయాసం ఉన్నట్టు అనిపిస్తే తొందరగా వైద్యులను కలిసి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పురుషుల్లోలాగానే మహిళలకు కూడా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స ఒక విధంగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇంకా కొంతమందిలో ఛాతీలో నొప్పి రాకుండానే గుండె పోటువచ్చే అవకాశం ఉంటుందని.. వారిలో వేరే లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. చెమటలు పట్టడం, ఆయాసం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.