Why Biopsy Test Is Required : మనకు వచ్చే అనారోగ్య సమస్యలను లక్షణాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు జ్వరం లాంటి అనారోగ్యం వస్తే శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాత వైద్యులు జ్వరానికి సంబంధించిన మందులు ఇచ్చి వాటిని వాడమని చెబుతారు. కొన్నిసార్లు జ్వరం ఎక్కువ రోజులు ఉందని తేలితే, రక్తపరీక్ష లాంటివి చేయిస్తారు. దీని వల్ల టైఫాయిడ్, మలేరియా లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది బయటపడుతుంది.
బయాప్సీ అంటే ఏంటి?
Biopsy Test In Telugu : ఇలా అనారోగ్య సమస్యలను బట్టి రకరకాల పరీక్షలను చేస్తారు. సాధారణంగా రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ చేయడం ద్వారా అనారోగ్య సమస్య ఏంటనేది తేలిపోతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఎన్ని పరీక్షలు చేసినా అసలు అనారోగ్య సమస్య ఏంటనేది పరీక్షల్లో వెల్లడికాదు. అలాంటి సందర్భాల్లో డాక్టర్లు ఉపయోగించే విధానమే బయాప్సీ. అనారోగ్యం లేదా రోగం మూలాల గురించి తెలుసుకునే పరీక్షే ఈ బయాప్సీ.
బయాప్సీ చేస్తారిలా!
సాధారణంగా క్యాన్సర్ నిర్ధరణకు బయాప్సీ చేయించాలని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే చాలామంది బయాప్సీ అనగానే క్యాన్సర్ అని అనుమానపడటం, భయపడటం లాంటివి చేస్తుంటారు. అయితే బయాప్సీ పద్ధతిలో ఎముక మూలుగ నుంచి కానీ ఎండోస్కోపిక్ పద్ధతిలో కానీ సూదిని గుచ్చి చర్మకణాలను సేకరించడం ద్వారా లేదంటే సర్జరీ చేయడం ద్వారా కానీ కణజాలాన్ని సేకరిస్తారు. దీనిని మైక్రోస్కోప్ సాయంతో పరీక్షిస్తారు. అనుభవం కలిగిన పాథాలజిస్ట్ క్యాన్సర్ కణాలను సులువుగా కనిపెడతారు.