Kesar Milk Health Benefits : సుగంధ ద్రవ్యాల్లన్నింటిలోనూ గొప్పది, మెరుగైన ఫలితాలను అందించేది కుంకుమ పువ్వు అని భారతీయులు బాగా నమ్ముతారు. బిర్యానీ వంటి స్పైసీ ఫుడ్ నుంచి ఖీర్ వంటి తీపి పదార్థాల వరకూ ఎన్నో స్పెషల్ ఐటమ్స్‌కు కుంకుమపువ్వు మంచి రంగును, రుచిని అందిస్తుంది. అంతేకాదు దీంట్లో ఉండే రసాయనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మానసిక స్థితిని, జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు, క్యాన్సర్ కణాలను తొలగించేందుకు సహాయపడతాయి. ఇన్ని మంచి లక్షణాలున్న కుంకుమపువ్వు మీ పిల్లలకు అమృతం లాంటిదని మీకు తెలుసా? రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు కుంకుమపువ్వు వేసి పిల్లలకు తాగించడం వల్ల వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? వివరంగా తెలుసుకుందాం రండి.
కుంకుమపువ్వు గొప్పతనం :
క్రోకస్ పువ్వు నుంచి వచ్చే కుంకుమపువ్వు చాలా శక్తివంతమైన మసాలా దినుసు. ఎరుపు రంగుతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగిన ఈ కేసర్లో సఫ్రానల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి, రోగినిరోధక వ్యవస్థను బలపరచి మొత్తం ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. అంతేకాదు మీ మూడ్‌ను మరింత ఉల్లాసంగా మార్చే లక్షణాలు కుంకుమపువ్వులో మెండుగా ఉంటాయి.
పిల్లలకు కుంకుమపువ్వు ఎలాంటి మేలు చేస్తుంది?
- ప్రశాంతమైన నిద్ర :ప్రస్తుతం చాలా మంది తల్లులు తమ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదని బాధపడుతున్నారు. అర్థరాత్రి వరకూ ఫోన్లు, టీవీల ముందు కూర్చోవడం, కబుర్లు చెప్పడం ఇప్పటి పిల్లలకు బాగా అలవాటు అయిపోయింది. అలాంటి వారికి కుంకుమపువ్వు మంచి పరిష్కారమని చెప్పచ్చు. దీంట్లోని సమ్మేళనాలు సెరొటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది ప్రశాంతమైన నిద్రకు తోడ్పడే న్యూరోట్రాన్స్మిటర్. కనుక రాత్రి పూట గ్లాసు గోరువెచ్చటి పాలలో, చిటికెడు కుంకుమపువ్వు కలిపి పిల్లలకు తాగిస్తే మీ పిల్లలు త్వరగా, హాయిగా నిద్రపోతారు.
- ఎముకలకు బలం :ఎముకల ఎదుగుదలకు, పుష్టికి బాల్యం అనేది చాలా కీలకమైన దశ. చిన్నవయసులోనే పిల్లలకు కాల్షియం చాలా అవసరం. పాలలో కాల్షియం ఉన్నప్పటికీ, కుంకుమపువ్వులోని మాంగనీస్, విటమిన్-సీ, విటమిన్-ఏ వంటి సూక్ష్మజీవులు ఎముకల ఎదుగులను మరింత పెంచుతాయి. ఈ పోషకాలు బలమైన ఎముకలకు, ఎదుగుదల సామర్థాన్ని పెంచేందుకు సహాయపడతాయి.
- జీర్ణ వ్యవస్థకు శ్రేయస్సు :జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కుంకుమపువ్వు పాలు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. ఇందులోని జీర్ణక్రియ లక్షణాలు అసౌకర్యాన్ని తగ్గించి జీర్ణ రుగ్మతలను శాంతపరుస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన పోషకాల శోషణకు తోడ్పడతాయి.
- మెదడు ఆరోగ్యం :బాల్యంలో అభిజ్ఞా వికాసం చాలా అవసరం. కుంకుమపువ్వులో ఉండే రిబోఫ్లావిన్, థయామిన్ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి, అభిజ్ఞా వికాసానికి తోడ్పడతాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన మెదడు కణాలను ఏర్పరచడానికి, సమర్థవంతమైన న్యూరల్ కమ్యూనికేషన్‌కు సహాయపడతాయి. కనుక రోజూ క్రమం తప్పకుండా మీ పిల్లలకు కుంకుమ పువ్వు పాలను పట్టించారంటే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భవిష్యతును ఏర్పాటు చేసినవారు అవుతారు.
మీరు జున్ను తింటారా లేదా? - పరిశోధనలో వెల్లడైన ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! - Junnu Health Benefits
మీ పెదాలపై పగుళ్లు ఏర్పడుతున్నాయా? - ఇలా చేస్తే గులాబీ రేకుల్లా మారిపోతాయి! - Lip Care Tips