Who Should Take Vitamin Supplements:విటమిన్ల లోపంతో జబ్బులు వస్తున్నాయని కొందరు.. బలం వస్తుందనే భావనతో మరికొందరు వైద్యుల సూచనలు లేకుండానే విటమిన్ మాత్రలు వేసేసుకుంటుంటారు. విటమిన్ ఎ నుంచి జింకు వరకు అన్ని రకాల సప్లిమెంట్లను మింగుతుంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండి, రకరకాల ఆహార పదార్థాలు తినేవారికి వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. కేవలం కొందరికి మాత్రమే ఈ విటమిన్ల ఉపయోగం ఉంటుందని వివరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే విటమిన్ సప్లిమెంట్ల అవసరం ఎవరికి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటుందని.. అలాంటి వారు ఈ మాత్రలు వేసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. గర్భం ధరించిన తొలిరోజుల్లో ఫోలిక్ యాసిడ్‌ను తీసుకుంటే పిండంలో నాడీలోపాలు ఏర్పడకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంకా గర్భధారణకు ప్రయత్నిస్తున్నవారు కూడా రోజూ ఫోలిక్ యాసిడ్‌తో కూడిన మాత్రలు వేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారాన్ని నమలటంలో, మింగలో వృద్ధుల్లో ఇబ్బంది తలెత్తుతాయి. కొందరు అయితే, మొత్తంగా ఆహారమే సరిగా తీసుకోకపోతుంటారు. ఫలితంగా పోషకాహార లోపానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి విటమిన్ల సప్లిమెంట్లు మేలు చేస్తాయని వివరిస్తున్నారు.
అల్సరేటివ్ కొలైటిస్, సీలియాక్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు జీర్ణక్రియను అస్తవ్యస్తం చేసి.. పోషణ లోపానికి దారితీస్తాయని చెబుతున్నారు. ఇంకా బరువు తగ్గటానికి చేసే బైపాస్ సర్జరీల వంటివీ కూడా దీనికి కారణం అవుతాయని వివరిస్తున్నారు. అలాంటి వారికి విటమిన్ మాత్రలు అవసరం అవుతాయని సూచిస్తున్నారు.