Yoga Asanas for Reducing Hip Fat: ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన రుగ్మతలు, ఒత్తిడి వంటి కారణాల వల్ల నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇవే కాకుండా అధిక చక్కెర వినియోగం వల్ల కూడా నడుము భాగంలో కొవ్వు పెరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
దీనిని తగ్గించుకునేందుకు ఆసనాలు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2018లో Bodywork and Movement Therapies జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ముఖ్యంగా మహిళల్లో నడుము సైజ్ తగ్గించుకోవడంలో యోగాసనాలు ప్రభావం చూపిస్తాయట. అదేవిధంగా.. "Effects of Yoga on Hip Circumference and Body Fat in Middle-Aged Women"అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలోనూ.. యోగాసనాలు మహిళల్లో బరువును తగ్గిస్తాయని తేలిందట. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ పరిశోధనలో Korea University వైద్యుడు Lee పాల్గొన్నారు. ఇంతకీ ఏ ఆసనాలు వేయాలంటే...
త్రికోణాసనం
మొదట కాళ్లను దూరంగా ఉంచి.. సౌకర్యవంతంగా నిల్చోవాలి. ఆ తర్వాత కుడిపాదాన్ని 90 డిగ్రీల కోణంలో తిప్పి ఉంచాలి. శరీర బరువు మొత్తం రెండు పాదాలపైనా సమానంగా పడేలా చూసుకోవాలి. అనంతరం దీర్ఘశ్వాస తీసుకుంటూ కుడివైపు తుంటి నుంచి కిందకు వంగి చేత్తో పాదాన్ని తాకించాలి. వీలైతే నేలనే తాకొచ్చు. అనంతరం ఎడమ చేతిని పైకిలేపి గాల్లో ఉంచాలి. చూసేవాళ్లకి కుడిచేయి, ఎడమచేయి కలిపి సరళరేఖలా అనిపించేలా ఆసనం వేయాలి. తలని ఎడమ చేతి వైపు తిప్పి.. చేతి వేళ్లను గమనించాలి. దీర్ఘ శ్వాస తీసుకుని సాధారణ స్థితికి వచ్చి.. ఆ తర్వాత ఎడమ వైపు కూడా ఇదే విధంగా చేయాలి. మెడనొప్పి, సర్జరీ అయినా, బీపీ ఉన్నా ఈ ఆసనం చేయకపోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
నౌకాసనం(బోట్ ఫోజ్)
నౌకను తలపించేలా ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని బోట్ ఫోజ్ అని కూడా పిలుస్తారు. ఇందుకోసం ముందుగా కింద కూర్చుని కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి బెండ్ చేయాలి. ఇలా మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి అవి తలకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అలా అని మోకాళ్లను వంచకూడదు. పాదాలను తల కంటే ఎత్తుకు వెళ్లేలా ఆసనం వేయకూడదు. ఆ తర్వాత మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోనే ఉంచి చేతులను ముందుకు చాచాలి. ఫలితంగా మన శరీర బరువంతా కూడా పిరుదుల మీద పడుతుంది. ఇలా హిప్స్ మీద బరువు పెడుతూనే నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా 10-20 క్షణాల పాటు ఆ భంగిమలో ఉండాలి. కొన్ని రోజుల తర్వాత 25-30 క్షణాల పాటు అలా నిలపుతారు. చిన్న విరామాలతో మూడు లేదా నాలుగు సార్లు ఈ ఆసనం వేయాలని సూచిస్తున్నారు.
వశిష్టాసనం (సైడ్ ప్లాంక్)
ఈ వశిష్టాసనం వేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు దృఢంగా మారతాయని వైద్యులు చెబుతున్నారు. దీనికోసం సైడ్ ప్లాంక్ భంగిమలో కూర్చోవాలి. ఈ క్రమంలో కుడిచేతిపై శరీర బరువును మోపి.. ఎడమ చేతిని పైకి ఎత్తాలి. ఆ తర్వాత ఎడమచేతిపై బరువును మోపి.. కుడిచేతిని పైకెత్తి ఇదే వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీర సమతుల్యత పెరగడంతో పాటు ఏకాగ్రత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఆసనం వల్ల నడుం భాగానికి, వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలకు వ్యాయామం అంది అవి దృఢమవుతాయి.