Protein Rich Food Vegetarian:మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా ప్రొటీన్ల అవసరం ఎంతో ఉంటుంది. అయితే, ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండేవారు.. అలుపు లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే శాకాహారానికి ప్రాధాన్యమిచ్చేవారు ప్రొటీన్లు పొందాలంటే ఈ పదార్థాల్ని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పుధాన్యాలు:కందులు, పెసలు, మినుములు మొదలైన వాటిలో ఉండే పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు. వీటిలోని పీచు పదార్థాలు కూడా శరీర బరువును క్రమబద్ధీకరిస్తాయని వివరిస్తున్నారు. ఇక వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు.. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు.
చిక్కుళ్లు:కిడ్నీ బీన్స్ (రాజ్మా), బ్లాక్ బీన్స్ వంటి చిక్కుడు జాతికి చెందిన పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రొటీన్లతో పాటు బి-విటమిన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయని వివరిస్తున్నారు. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుతాయని అంటున్నారు.
నట్స్:ప్రొటీన్లతో నిండి ఉండే బాదం పప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ప్రొటీన్లతో పాటు కొన్ని రకాల విటమిన్లు, ఫైబర్.. వంటి పోషకాలూ శరీరానికి అందుతాయని వివరిస్తున్నారు. అయితే నట్స్‌లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 2023లో Nutrients జర్నల్‌లో ప్రచురితమైన "Nuts and Cardiovascular Disease Outcomes: A Review of the Evidence and Future Directions" అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)