Winter Foods to Eat:చలికాలం వచ్చేసింది. రాత్రి, తెల్లవారుజామున చలి వణికించేస్తోంది. దుప్పటి ముసుగేసుకుంటేనే నిద్ర పడుతుంది. అయితే, ఈ సమయంలోనే వేడి వేడి బజ్జీలు, పకోడీలు తినాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటివి తినడం వల్ల చలికాలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చిన్న చిన్న జాగ్రత్తలతో వీటిని చాలావరకూ అదుపులో ఉంచుకోవచ్చని ప్రముఖ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. ఆహారం మీద శ్రద్ధ పెడితే నిరోధకశక్తినీ పెంచుకోవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"చలిని ఎదుర్కోవటానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. ఇందులో ఆహారం పాత్ర కీలకం కాబట్టి చలికాలంలో కాస్త ఎక్కువగా తినాల్సి ఉంటుంది. మిర్చీబజ్జీల వంటి చిరుతిళ్ల వైపు మళ్లుతుంటుంది. అయితే జంక్‌ఫుడ్‌తో బరువు పెరిగే ప్రమాదముంది. కాబట్టి చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. మనకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమనేది పొడవు, బరువు, చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా.. వాతావరణ ఉష్ణోగ్రత కూడా ముఖ్యమే. చలికాలంలో శరీరం నుంచి వేడి బయటకు వెళ్తుంది.. కాబట్టి శక్తినిచ్చే ఆహారం అవసరం ఉంటుంది. అందువల్ల చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు, ఆరు బయట పనులు చేసేవారు సాధారణం కన్నా మరింత ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అందుకే ఒకప్పుడు చలికాలంలో నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు. నువ్వులు, అవిసె గింజలు, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి గింజపప్పులు (నట్స్) శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. వీటిల్లోని మంచి కొవ్వులు చర్మాన్ని పగలకుండా కాపాడుతాయి. దీంతో పాటు విటమిన్ ఇ, విటమిన్ డి కూడా లభిస్తాయి. ఇవి జీవక్రియలను ఉత్తేజితం చేయటంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా పొట్టుతో కూడిన తృణధాన్యాలూ శక్తిని, విటమిన్లనూ అందిస్తాయి."
--డాక్టర్ జానకీ శ్రీనాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్స్, న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ పీజేటీఏయూ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్
నిరోధకశక్తి బలోపేతం చేస్తుంది
చలిలో సూక్ష్మక్రిములు ఎక్కువగా వృద్ధి చెందుతాయని చెప్పారు. ఫలితంగా జలుబు, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా చలికాలంలో వాయు కాలుష్యమూ ఎక్కువేనని.. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే నుసి పదార్థం పొగమంచుకు అంటుకుపోతుందని వివరించారు. దీనిలోని కాలుష్య కారకాలు పీల్చుకునే గాలితో పాటు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. చిక్కులు తెచ్చి పెడతాయన్నారు. కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ముఖ్యమని అన్నారు. ఇందుకు మంచి ప్రొటీన్ బాగా ఉపయోగపడుతుందని.. ఇది గుడ్డు, సరిగా ఉడికించిన చికెన్, చేపలు, మాంసంతో లభిస్తుందన్నారు. ఒకవేళ శాకాహారులైతే పొట్టుతో కూడిన పప్పులు, నూనెగింజలు, సోయా నగెట్స్, పాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చని సూచించారు.
- జీవక్రియల కోసం విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ డి బాగా తోడ్పడతాయని తెలిపారు. అలాగే కాలుష్య కారకాలు హాని చేయకుండా నిలువరిస్తాయని వివరించారు. కాబట్టి నిమ్మకాయ, బత్తాయి, నారింజ, జామ పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. బత్తాయి తింటే, నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందనే అపోహలు వీడాలని సూచించారు.
- నిమ్మకాయ పచ్చడి కాకుండా తాజా నిమ్మకాయల రసమే తీసుకోవాలని.. ఎరుపు క్యాప్సికం, పసుపు క్యాప్సికం, కీరా, క్యాబేజీలోనూ విటమిన్ సి ఉంటుందన్నారు.
- ఈ సీజన్లో ఉసిరి ఎక్కువగా లభిస్తుంది. ఇందులోనూ విటమిన్ సి మోతాదు ఎక్కువే ఉంటుంది. పైగా దీనిలోని విటమిన్ సి త్వరగా క్షీణించదు. రోజూ ఒక ఉసిరి ముక్క తినాలి. ఎండు ఉసిరి అయినా మేలే.
- గుడ్డు పచ్చసొన, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, చిలగడ దుంప, ఆకుకూరలతో విటమిన్ ఎ లభిస్తుంది.
- విత్తనాలు, గింజపప్పులు, నూనెగింజల్లో విటమిన్ ఇ ఉంటుంది.
- పాలు, నెయ్యి, వెన్న, చేపలు, గుడ్డు పచ్చసొన, మాంసం వంటి వాటిల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది నువ్వుల్లోనూ ఎక్కువగా ఉంటుంది.
- ఇంకా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి జింక్ కూడా అవసరం. ఇది చిక్కుళ్లు, గుమ్మడి విత్తనాలు, మాంస పదార్థాల్లో ఉంటుంది. ఇప్పుడు జింక్ కలిపిన పదార్థాల ఉత్పత్తులూ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.