Tomato Price Fall in Telangana : టమాట ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల కింద రూ.50 ఉన్న కిలో టమాట ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో టమాట రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాట ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
కిలో టమాట ధర : కొన్ని రోజుల కింద కిలో టమాట రూ.80 నుంచి రూ.100లతో బెంబేలెత్తించాయి. పది రోజుల కింద వరకు రూ.50 పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాట 25 కిలోల ట్రేను రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో ధర రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. 3 కిలోల టమాట రూ.20 చొప్పున అమ్ముతున్నారు. కనీసం రూ.20 ఉంటే తప్ప పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు.
అన్నదాత ఆవేదన : సమీప గ్రామాల నుంచి రైతు బజార్‌కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు రూ.50, హమాలీ ఛార్జి రూ.10 మొత్తం 60 ఖర్చవుతోంది. సరకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, రవాణా, హమాలీ ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయి.
పతనమవుతున్న టమాట ధరలు : కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో టమాటకు డిమాండ్ ఉంటుంది. మన రాష్ట్రంలో పండించిన పంటతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాట భారీగా వస్తోంది. దీన్ని సాకుగా చూపిస్తూ దళారులు రైతులకు ధరలు అందకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిల్వ చేసుకోవాలి : ధరల హెచ్చుతగ్గుల సమయంలో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టమాట ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి మార్కెటింగ్ చేస్తే రైతులకు భరోసా కలుగుతుంది. తద్వారా నిరుద్యోగ యువత, స్వయం సహాయ సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ట'మాటల్లేవ్' - సెంచరీ కొట్టిన ధర - TOMATO PRICES IN TELANGANA
Tomato Price Today : ఠారెత్తిస్తున్న టమాట.. సెంచరీ దాటిన రేటు