Physical Strength Test: మీరెంత బలవంతులు? ఈ విషయాన్ని ఎప్పుడైనా తెలుసుకోవటానికి ప్రయత్నించారా? దానికేముంది ఎంత బరువెత్తితే అంత బలవంతులమని అనేస్తుంటారు. కానీ ఈ పరీక్ష అంత కచ్చితమైంది కాదని నిపుణులు అంటున్నారు. చురుకుగా, గాయాల పాలు కాకుండా ఎంత బాగా కదులుతున్నారనేది నిజమైన బలాన్ని తెలుపుతుందని వివరిస్తున్నారు. అయితే, బలాన్ని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు మనకు తోడ్పడతాయని వెల్లడిస్తున్నారు. వీటిని అంచనగా తీసుకుని మొత్తం శరీర బలాని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పరీక్షలేంటో తెలుసుకుని మీరూ ఓసారి ట్రై చేయండి.
పిడికిలి పట్టు: మన పిడికిలి పట్టుతో బలాన్ని లెక్కించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరకులు మోసుకురావటం, బరువైన వస్తువులను జరపటం, చేత్తో పట్టుకునే పరికరాలతో పనిచేయటం వంటి పనులకు పిడికిలి ఎంతో తోడ్పడుతుందని వివరిస్తున్నారు. పిడికిలి పట్టును హ్యాండ్ డైనమోమీటర్ సాయంతో పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు. చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండే దీన్ని మధ్యలో నొక్కితే పిడికిలి బలమెంతో బయటపడుతుంది. 2019లో Journal of Strength and Conditioning Researchలో ప్రచురితమైన "Grip strength and its relationship to overall strength" అనే అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ఇందుకోసం అరచేయి పైకి ఉండేలా మణికట్టును 90 డిగ్రీల కోణంలో వంచాలి.
- ఆ తర్వాత డైనమోమీటర్‌ను చేత్తో పట్టుకొని, మధ్యభాగాన్ని వీలైనంత వరకు నొక్కాలి.
- అనంతరం మీటర్ రీడింగును గుర్తించి, పిడికిలి వదిలిపెట్టాలి.
- ఇలానే మరో రెండుసార్లు చేసి.. మూడు రీడింగుల సగటును లెక్కించాలి.
- ఇప్పుడు మరో చేత్తో కూడా ఇలానే డైనమోమీటర్‌ను నొక్కి, సగటు రీడింగ్ నమోదు చేసుకోవాలి.
సాధారణ పిడికిలి పట్టు వయసు, లింగ భేదాన్ని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో 20-29 ఏళ్ల వయసులో 46 కిలోలుంటే.. 60-69 ఏళ్ల వయసులో 30 కిలోలు ఉంటుందని అంటున్నారు. అదే ఆడవారిలో 20-29 ఏళ్ల వయసులో 29 కిలోలు కాగా 60-69 ఏళ్ల వయసులో 23.5 కిలోలు ఉంటుందని వివరిస్తున్నారు. వీటిని బట్టి పిడికిలి బలమెంతో ఎవరికివారే అంచనా వేసుకోవచ్చు. టెన్సిస్ లేదా స్ట్రెస్ బంతిని నొక్కటం, చేత్తో వాహనాలు తుడవటం, బట్టలు ఉతికి పిండటం వంటి పనులతో పిడికిలి పట్టును పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
పుషప్ సామర్థ్యం: పుషప్‌లు చేయడం వల్ల ఛాతీ, చేతులు, భుజాలు, కడుపు, వీపు కండరాలన్నీ ఒకేసారి పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. శరీర పైభాగం బలంగా ఉంటే రోజువారీ పనులు సాఫీగా చేసుకోవచ్చని చెబుతున్నారు. వీటిని చేయడం వల్ల భంగిమ, కదలికలూ మెరుగవుతాయని వివరిస్తున్నారు. అయితే, ఒకసారి ఎన్ని పుషప్‌లు తీయగలరనేది శరీర పైభాగం బలాన్ని, కండరాల సామర్థ్యాన్ని అంచనావేస్తుందని వెల్లడిస్తున్నారు. కానీ ఎంత బాగా పుషప్‌లు తీస్తున్నారనేదీ ముఖ్యమేనని.. నేలకు చేతులు ఆనించి పుషప్స్ తీస్తే అసలు శక్తి బయటపడుతుందంటున్నారు.
- ఇందుకోసం చేతులను చాచి, సరిగ్గా భుజాల కింద అరచేతులను నేలకు తాకించాలి.
- అనంతరం పాదాలను దగ్గరగా లేదా 12 అంగుళాల దూరంలో ఉంచి, కాలి వేళ్లను నేలకు తాకించాలి.
- ఈ స్థితిలో శరీర బరువు మొత్తం అరచేయి, పాదాల వేళ్ల మీదే ఉండేలా.. వెన్ను తిన్నగా ఉంచి బరువు వేళ్ల మీద సమానంగా పడేలా చూసుకోవాలి.
- ఇప్పుడు కిందికి చూస్తూ ఛాతీ నేలకు తాకించి, ఒక్క ఉదుటున శరీరాన్ని ఛాతీని పైకి లేపాలి.
- ఇలా రెండు సెకండ్ల పాటు కిందికి, ఒక సెకండు సేపు పైకి లేచేలా చూసుకోవాలి.
- సాధారణ వ్యక్తులు ఒకసారి 15-20 పుషప్స్ తీస్తే బాగానే చేస్తున్నారని అనుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఒకవేళ కాలి వేళ్ల మీద బలాన్ని మోపి, పుషప్స్ తీయటం సాధ్యం కాకపోతే మోకాళ్లను నేలకు ఆనించి లేదా గోడకు చేతులను ఆనించి అయినా చేయొచ్చని చెబుతున్నారు. బలం పెరుగుతున్నకొద్దీ పుషప్స్ సంఖ్య పెంచుకుంటూ రావాలని వివరిస్తున్నారు.
కింద కూర్చొని లేవటం: మనం సాధారణంగా నేల మీద కూర్చొని, సునాయాసంగా పైకి లేవటమూ బలానికి పరీక్షేనని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర నియంత్రణ, సమన్వయ సామర్థ్యంతో పాటు కాళ్లు, వీపు, కడుపు కండరాల బలాన్నీ చూపుతుందని వివరిస్తున్నారు. మెట్లు ఎక్కటం, బింగీలు తీయటం వంటివేవైనా కాళ్ల బలాన్ని, కదలికలను పెంపొందిస్తాయని సూచిస్తున్నారు. యోగా కూడా శరీరం తూలిపోకుండా కాపాడుతుందని సలహా ఇస్తున్నారు. ఇంకా కుర్చీలో కూర్చొని లేవటం ద్వారానూ నడుము, కాళ్లను బలోపేతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
- ఇందుకోసం ముందుగా కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవాలి. ఆ తర్వాత పైకి లేవాలి. (పడిపోతే పట్టుకోవటానికి పక్కన ఎవరైనా ఉండేలా చూసుకోవటం మంచిది)
- ఇందులో వచ్చే మార్కులను బట్టి దీని సామర్థ్యాన్ని గుర్తించొచ్చని చెబుతున్నారు.
- మొత్తమ్మీద 10 మార్కులు సాధించటం లక్ష్యంగా పెట్టుకోవాలి.
- ఎలాంటి సాయం తీసుకోకుండా సునాయాసంగా నేలపై కూర్చొని, పైకి లేవగలిగితే పదికి పది సాధించినట్టేనని అంటున్నారు.
- అలా కాకుండా ఒక చేయిని, మోకాళ్లను నేలకు తాకించటం, ముంజేయి సాయం తీసుకోవటం, ఒక చేతిని మోకాలు లేదా తొడ మీద పెట్టుకోవటం, పక్కకు తూలటం వంటివి గమనిస్తే ఒక మార్కును తీసేసుకోవాలని చెబుతున్నారు.
- ఉదాహరణకు- ఒక చేతి సాయం తీసుకున్నా, మోకాళ్లను నేలకు ఆనించినా ఒక మార్కు.. రెండు చేతులను, రెండు మోకాళ్లను నేలకు ఆనించి లేస్తే 4 మార్కులు తీసేయాలని తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ గుండె తక్కువగా కొట్టుకుంటుందా? హార్ట్ స్పీడ్ తగ్గితే ఏం చేయాలో తెలుసా?