When Is Fever Dangerous In Child :పిల్లలకు కాస్త శరీరం వెచ్చగా అయ్యిందంటే చాలు.. తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. ఎప్పుడు తగ్గుతుందా అని గాబరా పడతారు. అయితే.. చాలా సార్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని.. కానీ ఒక్కోసారి జ్వరం ప్రమాదకరంగా మారుతుందని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ బాలకృష్ణ చెబుతున్నారు. ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
పిల్లలకు ఒళ్లు వెచ్చపడగానే జ్వరంగా భావించవచ్చా?
సాధారణంగా పిల్లల శరీరం వెచ్చపడినప్పుడల్లా జ్వరం వచ్చినట్లుగా భావించాల్సిన అవసరం లేదు. ఏడాదిలోపు పిల్లలకు మందపాటి బెడ్‌షీట్ కప్పడం లేదా టైట్‌గా దుస్తులు వేసినప్పుడు శరీరం వెచ్చగా అవుతుంది. ఇవేకాక మనం పిల్లలను ఎత్తుకున్నప్పుడు కూడా మన వేడి వారికి కొద్దిగా వస్తుంది. అందుకే ఒళ్లు వెచ్చగా అయిన ప్రతిసారీ జ్వరం అనుకోకూడదు. థర్మామీటర్‌తో చెక్ చేసిన తర్వాతే జ్వరంగా నిర్ధరించుకోవాలి.
పిల్లల్లో జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి?
- పిల్లలు సరిగ్గా పాలు తీసుకోకపోవడం
- బాగా మగతగా ఉండడం
- ఆడుకోకుండా డల్‌గా ఉండడం
- ఎక్కువగా మాట్లాడకుండా నిశబ్దంగా ఉండడం
- ఆహారం, నీరు సరిగ్గా తీసుకోకపోవడం
పిల్లల్లో జ్వరానికి కారణాలు ఏంటి?
నెలలోపు చిన్నారులను చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఎత్తుకోవడం, ముద్దులు పెట్టడం వల్ల బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన లక్షణాలను కూడా జ్వర లక్షణాలుగా భావించవచ్చు.
పిల్లల్లో జ్వరాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి?
మామూలుగా తొలిరోజు సాధారణ జ్వరం ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ.. తొలిరోజే 103, 104 డిగ్రీల జ్వరం, కళ్లు తెరవలేకపోవడం, నీరసం, వీరేచనాలు, బీపీ తగ్గడం లాంటి పరిస్థితులు ఉంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదిచాలి. పాలు, నీరు సరిగ్గా తాగుతున్నారా? మూత్రవిసర్జన చేస్తున్నారా అని చూస్తుండాలి.
జ్వరంతో పాటు ఫిట్స్ రావడం ప్రమాదమా?
ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్ వస్తుంది. కానీ తొలిరోజు మాత్రమే ఫిట్స్ వస్తుంది. సాధారణంగా 102 డిగ్రీలకు మించినప్పుడు 2-3 నిమిషాల పాటు ఫిట్స్ వచ్చి ఆగిపోతాయి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్ వస్తే మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొలిరోజు జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చి తొందరగా తగ్గిపోతే ఫర్వాలేదు. అంతేకానీ రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి.
పిల్లలకు జ్వరంగా ఉన్నపుడు ఏం పెట్టాలి?
పిల్లలకు జ్వరం ఉన్నపుడు పోషకాహారం అందించాలి. హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. జ్వరంతో ఉంటే పథ్యం పెట్టాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడు బాగా జీర్ణం అయ్యే ఆహారా పదార్ధాలు, పెరుగు, ఆకుకూరలు, ఉప్పు, కారం లేని పదార్ధాలు పెట్టాలి.
సొంతంగా మందులు, సిరప్లు వాడొచ్చా?
"చాలా మంది తల్లిదండ్రులు ఏడాది కింద డాక్టర్ రాసిచ్చిన మోతాదు మందులనే.. ఆ తర్వాత కూడా పిల్లలకు వాడుతుంటారు. దీని వల్ల డోస్ సరిపోదు. అలా కాకుండా డోస్ పెంచి ఇచ్చినా ప్రమాదమే. కాబట్టి.. డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది." అని బాలకృష్ణ వివరించారు.
కిడ్నీలో రాళ్లున్నాయా?- ఈ చిన్న టిప్స్‌తో ఇట్టే కరిగిపోతాయ్! - Kidney Stone Treatment
అలర్ట్ : మీకు ఈ ఫుడ్ తినే అలవాటు ఉందా? - అయితే, మీకు గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉన్నట్టే! - Heart Unhealthy Foods