IDIOT Syndrome Symptoms : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక మానవాళికి ఎంత లబ్ధి జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న సమస్యకైనా క్షణాల్లోనే ఒక్క క్లిక్‌తో పరిష్కారం కనుక్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఇంటర్నెట్‌లో(Internet), యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఎవరికి వారే డాక్టర్లు అయిపోతున్నారు. మీరూ అదే విధంగా చేస్తున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మీరు ఇడియట్ సిండ్రోమ్(IDIOT Syndrome) బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలేంటి, ఇడియట్ సిండ్రోమ్? దీని లక్షణాలేంటి? ఎలాంటి పరిణామాలుంటాయి? ఎలా బయటపడాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే?:ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో పదే పదే సెర్చ్ చేయడాన్ని 'ఇడియట్ సిండ్రోమ్'గా పిలుస్తారంటున్నారు నిపుణులు. IDIOT Syndrome అంటే.. ‘ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ సిండ్రోమ్. దీన్నే వైద్య పరిభాషలో 'సైబర్‌కాండ్రియా' అని కూడా పిలుస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది తమకున్న లక్షణాల ఆధారంగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి జబ్బు ఏంటో నిర్ధారించుకుని డాక్టర్‌ను సంప్రదించకుండానే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు.
ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు :
- ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు తీవ్ర ఆందోళనలో ఉంటారంటున్నారు నిపుణులు.
- చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్లు ఆందోళన చెందడం.
- అనవసరంగా గంటల తరబడి వైద్య సమాచారం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం.
- ఇంటర్నెట్‌లో లభించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా దిగులు చెందడం.
- ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఇప్పటికే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించి విపరీత నిర్ణయాలు తీసుకోవడం.
- వైద్యులు ఇచ్చే సమాచారాన్ని నమ్మకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు
2021లో 'జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. IDIOT సిండ్రోమ్‌తో బాధపడుతున్నవారిలో ఆందోళన, నిరాశ స్థాయిలు మిగతావారికంటే ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆక్యుపేషనల్ థెరపీ ప్రొఫెసర్ డాక్టర్ A. స్మిత్ పాల్గొన్నారు. ఇడియట్ సిండ్రోమ్ ఉన్నవారు ఆందోళనతో ఇబ్బందిపడతారని ఆయన పేర్కొన్నారు.