తెలంగాణ

telangana

"క్రాష్‌ డైట్‌"తో నిజంగా బరువు తగ్గుతారా? - ఆరోగ్యానికి మంచిదేనా? - What is CrashDiet

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 3:36 PM IST

What is Crash Diet : ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలనుకునే వారు క్రాష్‌డైట్‌ విధానాన్ని పాటిస్తున్నారు. అయితే, చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు! అసలు క్రాష్‌డైట్‌ అంటే ఏంటీ ? ఈ డైటింగ్‌లో ఏ ఆహార నియమాలను పాటిస్తారు ? అనే విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.

CrashDiet
What is CrashDiet (ETV Bharat)

What is Crash Diet : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలా అనారోగ్యకరమైన బరువు పెరగడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివిప్రధాన కారణాలు. అయితే, ఈ మధ్య కాలంలో కొంత మంది యువతీయువకులు వేగంగా బరువుతగ్గాడానికి క్రాష్‌డైట్‌ వంటి విధానాలను పాటిస్తున్నారు. దీనివల్ల కొంత వరకు వెయిట్‌లాస్‌ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ క్రాష్‌డైట్‌ అంటే ఏంటీ ? డైట్‌లో ఎటువంటి నియమాలు పాటించాలని అనే విషయాలను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్‌ జనాకీ శ్రీనాథ్' చెబుతున్నారు. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

అక్కడ డైటింగ్‌ ఎలా చేస్తారు ?
క్రాష్‌డైట్‌ను 'జోన్‌ డైట్‌' అని మరొక పేరుతో కూడా పిలుస్తారు. బరువు తగ్గించే ఈ విధానం అమెరికాలో బాగా పాపులర్‌. ఈ డైట్‌ పాటించడం వల్ల వెయిట్‌లాస్‌ అవ్వడంతో పాటు, వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయట. క్రాష్‌డైట్‌ చేసేవారు కొన్ని ఆహారనియమాలు పాటిస్తారు. సాధారణంగా వారి ఆహారంలో 40శాతం కార్బోహైడ్రేట్లు, 30శాతం కొవ్వులు, 30శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటారు. అయితే, ఈ డైట్‌ వ్యక్తులను బట్టి మారుతుంది. ఈ విధమైనటువంటి డైటింగ్‌చేసేవారు రోజుకి మూడుసార్లు మీల్స్‌, రెండుసార్లు స్నాక్స్‌ తీసుకుంటారు. అయితే, ఇదంతా అమెరికాలో డైటింగ్‌ చేసేవారు పాటిస్తారు.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు :
ఇక మనదేశంలో క్రాష్‌డైట్‌ చేసేవారు పూర్తిగా అన్నం, నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాలకు బదులుగా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు.. బొబ్బర్లు, శనగలు, పెసలు, రాజ్మా, అలసందలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉండే బెండకాయ, క్యాబేజీ, బీన్స్, టొమాటో వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్‌ కోసం అవిసెగింజల పొడి, నువ్వులు, బాదం, గుమ్మడి గింజలు వంటివాటిని డైట్‌లో భాగం చేసుకోవాలి.

హెచ్చరిక : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? - ఆరోగ్యానికి తీవ్ర ముప్పు - వారానికి ఇంతే తగ్గాలి! - How Much Weight Loss Per Week

నిపుణుల సలహా తప్పనిసరి!
ఆలివ్‌ ఆయిల్‌ని వెజిటబుల్‌ సలాడ్స్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటితోపాటు ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ కొవ్వులుండే పాలు, చీజ్, పనీర్, హై ప్రొటీన్‌ ఉండే బటర్‌ మిల్క్‌లు దొరుకుతున్నాయి. వాటిని డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఈ నియమాలన్నింటినీ పోషకాహార నిపుణుల సలహా మేరకు బాడీ కంపోజిషన్‌ టెస్ట్‌ చేయించుకున్నాక మాత్రమే అనుసరించాలని డాక్టర్‌ జనాకీ శ్రీనాథ్ చెబుతున్నారు.

ఎందుకంటే.. కొంతమంది శరీరంలో చెడు కొవ్వులు ఎక్కువగానూ, కండర సామర్థ్యం తక్కువగానూ ఉంటాయి. అలాగే మరికొంత మందిలో కండరాలు ఎక్కువగానూ, చెడు కొవ్వులు తక్కువగానూ ఉంటాయి. దీనివల్ల మనిషిని బట్టి తీసుకునే ఆహార నియమాలు, పరిమాణాలు మారుతుంటాయి. కాబట్టి నిపుణులను తప్పకుండా సంప్రదించిన తర్వాతే ఈ క్రాష్‌డైట్‌ విధానాన్ని పాటించాలని ఆమె పేర్కొన్నారు. మంచి ఫలితం కనిపించడానికి డైటింగ్‌తో పాటు, వ్యాయామం కూడా చేయాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజుకొకటి తప్పనిసరి- పండ్లు తింటూ ఈజీగా బరువు తగ్గండిలా! - Weight Loss Tips

అధిక బరువు, జీర్ణసమస్యలతో బాధపడుతున్నారా? ఓసారి 'జీరా వాటర్' ట్రై చేయండి! - Jeera Water Health Benefits

ABOUT THE AUTHOR

...view details