Best Sleeping Positions to Reduce Stress :మన రోజువారీ జీవితంలో పలు సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు గురవడం సహజమే. ఇవే కాకుండా నిద్రలేమి కూడా ఒత్తిడికి ఓ కారణం అన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. సుఖంగా నిద్ర పట్టకపోవడానికి మనం పడుకునే కొన్ని రకాల భంగిమలే కారణమంటున్నారు నిపుణులు. ఈ భంగిమల్లో పడుకోవడం వల్ల శరీరంలోని ఆయా భాగాలపై ప్రతికూల ప్రభావం పడి.. నిద్రలేమికి, దాంతో మానసిక ఒత్తిడికి దారితీస్తుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఏయే భంగిమల్లో పడుకోకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కారణం ఇదే:మనం నిద్రపోయినప్పుడే బాడీ రిలాక్సవుతుంది. ఈ క్రమంలో శరీర అవయవాలన్నీ రిపేరై పునరుత్తేజితమవుతాయి. ఇంతవరకు బానే ఉన్నా ఒక్కోసారి నిద్రలేచే సరికి కొన్ని భాగాల్లోని కండరాలు పట్టేస్తుంటాయి. దీనికి కారణం మనం పడుకున్న స్లీప్ పొజిషన్సే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కండరాలు పూర్తి స్థాయిలో రిలాక్స్ కాకపోవడంతో పాటు.. ఈ నిద్రా భంగిమల వల్ల మధ్యలో మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, తద్వారా ఒత్తిడికి లోను కావడం.. వంటివి జరుగుతాయంటున్నారు.
ఇలా పడుకుంటున్నారా?
- కొంతమంది ముడుచుకొని పడుకుంటారు. అంటే ఓ పక్కకు తిరిగి, కాళ్లు రెండూ పొట్ట దగ్గరికి తీసుకొచ్చి నిద్ర పోతుంటారు. అయితే ఇలా నిద్రించడం వల్ల శ్వాస వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అలాగే వీపు, మెడ వద్ద అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నిద్రకు అంతరాయం ఏర్పడి ఒత్తిడి ఎదురవుతుందంటున్నారు.
- బోర్లా పడుకునే వారు చాలామందే. దీనివల్ల మెడ, వీపు కింది భాగంలో ఒత్తిడి పడుతుందని.. అలాగే ఈ భంగిమలో మెడను ఒక వైపుకి తిప్పి పడుకుంటాం కాబట్టి మెడనొప్పి వేధిస్తుందని.. ఇదీ నిద్రలేమి, ఒత్తిడికి కారణమవుతుందంటున్నారు.
- ఇక కొంతమంది వెల్లకిలా పడుకున్నా.. చేతులు, కాళ్లు చాచి పడుకుంటారు. దీన్నే ‘స్టార్‌ఫిష్ పొజిషన్’ అంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు పడుకున్నా చేతులు, కాళ్లలోని కండరాలు పట్టేసే ప్రమాదం ఉంటుందని.. అంతేకాకుండా.. ఈ భంగిమ గురక రావడానికీ కారణమవుతుందంటున్నారు. దీనివల్ల కూడా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.
- ఏదైనా ఓ పక్కకి తిరిగి పడుకున్నా.. చేతులు పూర్తిగా చాచి నిద్రపోతుంటారు కొంతమంది. అయితే ఈ భంగిమ మెడ, భుజాల్లో అసౌకర్యానికి కారణమవుతుందని.. కాబట్టి ఒత్తిడి ఎదురవకుండా ఉండాలంటే ఈ భంగిమ మంచిది కాదంటున్నారు.