Dry Fish Benefits In Telugu :చాలా మందిఎండు చేపల పేరు చెప్పగానే ముక్కు మూసుకుంటారు. పచ్చి చేపలు తినేవారు కూడా.. ఎండు చేపలు విషయానికి వచ్చేసరికి "నో" చెప్పేస్తారు. వీటిని వండేటప్పుడు వచ్చే వాసన భరించలేమంటారు. అయితే.. కారణాలు ఏవైనప్పటికీ, ఎండు చేపలు తినకుండా ఉండడం వల్ల ఎన్నో పోషకాలు కోల్పోతారని వైద్య నిపుణులు అంటున్నారు.
ఎండు చేపల వాసన కొద్దిగా భరించలేనిదిగానే ఉన్నా.. పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయని అంటున్నారు. ఎండు చేపలు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతాయని డాక్టర్ జార్ డైర్బర్గ్, డాక్టర్ ఎర్రిక్ బర్గ్ కనుగొన్నారు. నరాల, కండరాల సమస్యలను తగ్గించి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని వారు అంటున్నారు. ఇవే కాకుండా ఎండు చేపలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు చేపల్లో బోలెడు పోషకాలు..
ఎండు చేపల్లో ప్రొటీన్లతో పాటు విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, సోడియం ఉంటాయని డాక్టర్లు చెప్పారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
ఎండు చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. గుండె పనితీరును మెరుగు పరుస్తుందని నిపుణులు చెప్పారు. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని తెలిపారు. ఎండు చేపల్లో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలకు పుష్టిని అందిస్తాయని వివరించారు.
కండరాలు, నరాల సమస్యలకు చెక్
ఎండు చేపల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుందని.. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ఇందులో ఉండే పోషకాల కారణంగా శరీరం పొడిబారకుండా ఉంటుందని చెప్పారు. ఎండు చేపలు నరాల సమస్యలను నివారణకు.. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఎండు చేపలు శరీరంలోని రక్తపోటును కూడా నియంత్రిస్తాయని వివరించారు.