Side Effects of Legs Crossing: ఇళ్లు, ఆఫీసు.. ప్రదేశం ఏదైనా చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. కొద్ది మంది అలవాటు ప్రకారం వేసుకుంటే.. కొద్దిమంది స్టైల్ కోసం వేసుకుంటారు. అయితే ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
రక్తప్రసరణ సమస్యలు:కాలు మీద కాలు వేసుకోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది తిమ్మిరి, నొప్పి, వాపు, ఇతర సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా, ఇది సిరల థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
నడుము నొప్పి:ఈ భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుందని.. సమయం గడిచేకొద్దీ ఇది డిస్క్ హెర్నియేషన్, సహా ఇతర వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2014లో జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాలు మీద కాలు వేసుకోవడం వల్ల వెన్నముకపై 32% అదనపు ఒత్తిడి కలుగుతుందని పేర్కొన్నారు.
నరాల నష్టం:కాలు మీద కాలు వేసుకోవడం వల్ల సయాటిక్ నరాలపై ఒత్తిడి పెరుగుతుందని.. ఇది కాళ్లలో నొప్పి, జలదరింపు, మొద్దుగా అనిపించడం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు:ఈ భంగిమ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణ సమయం పెరుగుతుందని తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నారు. దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చొని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటోంగ్ విశ్వవిద్యాలయం గాస్ట్రోఎంటరాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా జియాన్-పింగ్ లియు పాల్గొన్నారు.
వెరికోస్ వెయిన్స్:కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కాళ్లలోని సిరలలో రక్త ప్రవాహం తగ్గుతుందని.. దీంతో సిరలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా దీర్ఘకాలికంగా ఒత్తిడి పెరగడం వల్ల సిరలు సాగిపోతాయని తద్వారా వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.