Warm Water Shower For Sleep : ప్రపంచవ్యాపంగా పదిలో దాదాపు ఐదుగురు ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. రాత్రి పూట నిద్ర పట్టక, శరీరానికి సరిపడా నిద్ర అందక, మరుసటి రోజు నీరసంతో, చికాకుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి శారీరక శ్రమ, ఆహార సమయాల్లో మార్పులు, సౌకర్యవంతమైన బెడ్డు, దుప్పట్లు, దిండు లాంటివి అవసరమని నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. వీటితో పాటు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల బాగా నిద్రపోవచ్చని చాలా మంది నమ్ముతారు. పడుకునే ముందు స్నానం చేయడం వల్ల నిజంగానే హాయిగా నిద్రపోవచ్చా? నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారికి రాత్రిపూట స్నానం ఎంతవరకూ ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుసుకుందాం.
రాత్రిపూట స్నానం చేస్తే బాగా నిద్రపోవచ్చా
రాత్రి పూట స్నానం చేయడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ఎందుకంటే హాయిగా నిద్రపోవాలంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండటం చాలా అవసరం. గోరు వెచ్చని నీటితో స్నానం చేసే అలవాటు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుందని తెలిపారు. అంతేకాదు రోజంతా అలసిపోయి, చెమట, మురికితో విసిగిపోయిన శరీరానికి కొత్త ఉత్సాహాన్ని, తాజా దనాన్ని అందిస్తుందట. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మెరుగైన, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుందని ఓ అధ్యయనాల్లో తెలింది.
గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి కాసేపటికి తగ్గుతుంది. ఈ ప్రక్రియ మీరు నిద్రపోయే సమయం వచ్చింది అంటూ శరీరాన్ని, మెదడును నిద్రకు ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీన్ని ప్రతి రోజూ అలవాటుగా మార్చుకుంటే నిద్రలేమి సమస్యను పూర్తిగా అధిగమించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలకు, మెదడుకు ఒత్తిడి నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. శరీరానికి రక్త ప్రసరణ మెరుగయేలా చేస్తుంది. రోజంతా మీ చర్మంపై పేరుకుపోయి ఉన్న చెమట, మురికిని శుభ్రం చేసి శరీరాన్ని, మెదడునీ ప్రశాంతంగా మార్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.