తెలంగాణ

telangana

ETV Bharat / health

నడుస్తుంటే కాళ్లు, పిక్కల్లో తీవ్రమైన నొప్పా? లేట్ చేస్తే కట్ చేయాల్సి వస్తుందట! - VASCULAR BLOCKAGE IN LEG TREATMENT

-రక్తనాళాల మార్గాలు మూసుకుపోతే శరీరానికి తిప్పలు! -ఈ సమస్యలు ఉన్నవారిలో అధిక ముప్పు అంటున్న నిపుణులు

Vascular Blockage in Leg Treatment:
Vascular Blockage in Leg Treatment: (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 9, 2024, 9:10 PM IST

Vascular Blockage in Leg Treatment: మీరు నడుస్తున్నప్పుడు పాదాలు జలదరించినట్టు అనిపిస్తోందా? ముఖ్యంగా పిక్కల్లో ఒక మాదిరి నుంచి తీవ్రమైన నొప్పి వస్తుందా? నడక ఆపేస్తే వెంటనే తగ్గిపోయి.. మళ్లీ నడక మొదలెట్టగానే తిరిగి నొప్పి ఆరంభమవుతుందా? కొన్నిసార్లు అయితే, పాదం వేళ్లు రంగు నల్లగా మారి.. కాళ్ల వాపూ, పాదాలపై పుండ్లూ ఏర్పడతాయి. వీటికి అనేక క్రీములు రాసినా, డాక్టర్లను సంప్రదించినా.. ఫలితం కనిపించక బాధపడుతుంటారు. ఇంతకీ ఈ సమస్యలకు కారణమేంటో తెలుసా? కాళ్లకు రక్త సరఫరా తగ్గటం అంటున్నారు ప్రముఖ వ్యాస్కులర్ కార్డియోథొరాసిడ్ సర్జన్ డాక్టర్ కేకే పాండే. అందుకే రక్త సరఫరా తగ్గడానికి గల కారణాలేంటో వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం
మధుమేహంతో బాధపడే వారికి నాడులు, రక్తనాళాలు దెబ్బతినే ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరిలో రక్తనాళాల గోడల్లో నిరంతరం క్యాల్షియం, కొలెస్ట్రాల్‌ పోగవుతుందని.. ఇవి పూడికలుగా ఏర్పడటం వల్ల కాళ్లకు రక్త సరఫరా తగ్గుతుందని వివరించారు. ఇలా జరిగి కొన్నిసార్లు రక్తనాళం పూర్తిగా మూసుకుపోవచ్చని ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుందని తెలిపారు.

కాళ్లు ఉబ్బడం
కాలి సిరల్లో అడ్డకుంలు ఏర్పడినా, కుంచించుకు పోయినా చెడు రక్తం పైకి చేరటం తగ్గి కాళ్లు ఉబ్బటం మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో తగిన చికిత్స తీసుకోకపోతే కాళ్లలో, పాదాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయని.. ఈ దశలో రక్త ప్రసరణను సరి చేయకపోతే పుండ్లకు దారితీస్తుందని సూచిస్తున్నారు.

నడుంనొప్పి వస్తోందా?
పొగ తాగేవారిలో, పొగాకు నమిలేవారిలో, మధుమేహం గలవారిలో కొందరు నడుస్తున్నప్పుడు వెన్నులో లేదా తొడలో నొప్పి పుడుతోందని అంటుంటారు. ప్రధాన రక్తనాళం కుంచించుకున్నా, పూర్తిగా మూసుకున్నా వీపు కండరాలకు రక్త సరఫరా తగ్గుతుందని.. దీంతో నడుం నొప్పి తలెత్తుతుందని వివరించారు. వీపు కండరాలకు రక్త సరఫరా తగ్గితే ఆ తర్వాత పాదాలకూ తగ్గుతుందని గుర్తించుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు నడుం నొప్పితో పాటు పాదాల్లోనూ నొప్పి పుడుతుందని చెబుతున్నారు.

రక్తనాళ గోడల వాపు
కొందరికి రక్తనాళాల గోడల్లో వాపు తలెత్తి లోపలి మార్గం సన్నబడి రక్త ప్రసరణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దీన్నే వ్యాస్కులైటిస్‌ అంటారు. రక్త ప్రసరణ మెరుగవ్వటానికి సమయానికి తగు చర్యలు తీసుకోకపోతే పాదం వేళ్ల చర్మం రంగు మారి చివరికి నల్లగా అవుతుంది. ఎందుకంటే రక్త సరఫరా కాకపోవటం వల్ల వేళ్లు కుళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుందని చెబుతున్నారు. దీనికి సాధారణంగా మన రోగనిరోధక శక్తి పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే స్క్లీరోడెర్మా జబ్బు కారణమవుతుంటుందని వివరించారు.

తీవ్రమైన కొద్దీ ఇబ్బందీ
నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వస్తోందంటే కాళ్లకు గణనీయంగా రక్త ప్రసరణ తగ్గిందనే అనుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు పాదాలు నొప్పి పుడుతున్నాయంటే సమస్య ప్రమాదకర స్థితికి చేరినట్టే అని హెచ్చరించారు. పాదాలకు 90% వరకూ రక్త ప్రసరణ తగ్గిందనే భావించాల్సి ఉంటుందని.. పరిస్థితి అలాగే కొనసాగితే వేళ్లు, పాదాలకు రక్త సరఫరా నిలిచిపోయి, ఆ భాగాలు కుళ్లిపోయే (గ్యాంగ్రీన్‌) ప్రమాదముందని వివరించారు. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే ఆయా భాగాలను తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

పాత పుండు
చాలా మందికి రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, పాదాలు విరగటం తరచూ చూస్తుంటాం. చికిత్స తీసుకున్నాక ఎముకలు బాగానే అతుక్కుంటాయి. కానీ ఎముకలకు పక్కనుండే రక్తనాళం అతుక్కునే క్రమంలో లోపలి మార్గం సన్నబడడం.. కొన్నిసార్లు పూర్తిగానూ మూసుకోవచ్చు. ఫలితంగా రక్తనాళంలో రక్త ప్రసరణ తగ్గిపోయి నొప్పి, జలదరించటం వంటి లక్షణాలు తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోతే వేళ్లు లేదా పాదం నల్లబడే ప్రమాదముందని.. చర్మం నల్లబడిందంటే గ్యాంగ్రీన్‌కు సంకేతమనే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఎలా గుర్తిస్తారు?
కాళ్లకు రక్త సరఫరాను తెలుసుకోవటానికి డాప్లర్‌ పరీక్షను చేస్తుంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటిదైన ఆర్టీరియల్‌ డాప్లర్‌ పరీక్షతో కాళ్లకు మంచి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను పరిశీలిస్తుంటారు. రెండోదైన వీనస్‌ డాప్లర్‌ పరీక్ష.. కాళ్ల నుంచి చెడు రక్తాన్ని పైకి చేరవేసే సిరల్లో రక్త సరఫరా తీరును తెలియజేస్తుంది. ఈ పరీక్షల వల్ల రక్త సరఫరా తగ్గిందా? పూడికలు ఏర్పడ్డాయా? అనేవి తెలుస్తాయి. ఒకవేళ డాప్లర్‌ పరీక్షలో రక్తనాళం పూర్తిగా మూసుకున్నట్టు తేలితే కాళ్లకు సీటీ యాంజియోగ్రఫీ అనే టేస్ట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో పూడిక తీవ్రతతో పాటు రక్తనాళంలో ఎంత రక్తం సరఫరా అవుతుందో కూడా బయటపడుతుందని తెలిపారు. అలాగే గుండె పనితీరును తెలుసుకోవటానికి, గుండె గదిలో రక్తం గడ్డలు లేవని తేల్చుకోవటానికి ఈసీజీ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే గుండె గదుల్లోని రక్తం గడ్డలు కాళ్లలోకి చేరుకునే ప్రమాదముందని వివరించారు.

చికిత్స ఏంటి?
కాలి రక్తనాళాలు సంకోచించినా, పూర్తిగా మూసుకున్నా వెంటనే వ్యాస్కులర్‌ సర్జన్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తాన్ని పలుచగా, రక్తనాళాలు విప్పారేలా చేసే మందులు.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు, నొప్పి మందులు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో ఫలితం కనిపించకపోతే సర్జరీ అవసరమవుతుందని వివరించారు. రక్తనాళంలో కొద్దిభాగంలోనే పూడికలుంటే స్టెంటు వేయటం ద్వారా పాదాలకు తిరిగి సరఫరా పుంజుకుంటుందని.. ఒకవేళ పూడిక పొడవుగా ఉంటే బైపాస్‌ సర్జరీ అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇందులో వేరే చోటు నుంచి రక్తనాళాన్ని తెచ్చి, పూడికకు అటూ ఇటూ అతికిస్తారని.. ఫలితంగా రక్త సరఫరా మెరుగవుతుందన్నారు. అయితే వయసు, సమస్య తీవ్రత, అప్పటికే ఉన్న ఇతరత్రా జబ్బులను పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారని తెలిపారు. ఆసుపత్రిలో సరైన వైద్యులు, అధునాతన సదుపాయాలు అన్నింటికన్నా ముఖ్యంగా స్టెంట్‌ వేయటానికి డీఎస్‌ఏ (డిజిటల్‌ సబ్‌ట్రాక్షన్‌ యాంజియోగ్రఫీ) ల్యాబ్‌ ఉందో లేదో చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నారా? కీళ్లవాతం వచ్చే ఛాన్స్ ఉందట జాగ్రత్త!

బిగ్ అలర్ట్ : రోడ్ సైడ్ టి​ఫిన్ చేస్తున్నారా? - క్యాన్సర్ ముప్పు తప్పదట!

ABOUT THE AUTHOR

...view details