These Professions Most Likely To Cause Varicose Veins :సాధారణంగా వయసు పైబడే కొద్దీ సిరల ఆరోగ్యం నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. అందుకే వృద్ధుల్లో వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువగా కనిపించడాన్ని మీరు గమనించవచ్చు. అయితే, వృద్ధాప్యంలో మాత్రమే కాదు.. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఈ వెరికోస్ వీన్స్(Veins)ప్రాబ్లమ్ తలెత్తొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల వృత్తులు, పనులు, జాబ్స్ చేసే వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇంతకీ, వెరికోస్ వీన్స్ ఎవరికి వచ్చే రిస్క్ ఎక్కువ? ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నర్సులు, కటింగ్ షాప్స్‌లో పనిచేసే వారు, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, సెక్యూరిటీ గార్డులు.. ఇలా ఎక్కువ సమయం నిలబడి పనిచేస్తుండే వారిలో వెరికోస్ వీన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్లలో రక్తం నిలిచిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు ఉబ్బి, మెలికలు తిరుగుతాయని చెబుతున్నారు. అయితే, ఈ వెరికోస్ వీన్స్ సాధారణంగా కాళ్లలోని సిరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ఎందుకంటే.. నిలబడి నడవడం వల్ల ఈ సిరల్లో ఒత్తిడి పెరుగుతుందంటున్నారు.
2018లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ నర్సింగ్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నర్సులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు వారి పనిలో ఎక్కువ సమయం నిలబడి ఉండటం వలన వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు.
అంతేకాదు.. సిరల ఉబ్బు మహిళల్లో కూడా ఎక్కువగా కనబడుతుందంటున్నారు హైదరాబాద్‌లో కేర్ హాస్పిటల్స్‌కు చెందిన వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పి.సి.గుప్తా. ముఖ్యంగా.. గర్భిణుల్లో హార్మోన్లలో మార్పుల మూలంగా సిరల కవాటాలు వదులై రక్తం కిందికి జారిపోతూ నాళాల ఉబ్బుకు దారితీయొచ్చని చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా.. వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనబడుతుంటుంది. వయసు మీద పడటంతోనూ దీని ముప్పు పెరగొచ్చంటున్నారు. అదేవిధంగా.. డీప్ వీన్ థ్రాంబోసిస్, ఆర్టిరియో వీనస్ మాల్‌ఫార్మేషన్స్, ఏవీ ఫిస్టులా వంటి ఇతరత్రా సమస్యలు కూడా సిరల ఉబ్బుకు దారితీయొచ్చంటున్నారు.