Are You Using Smartphone in Toilets? :నేటి యువతకుపొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే దాకా చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. ఇది పక్కన లేకపోతే నిమిషం కూడా ఉండలేనట్టుగా ప్రవర్తిస్తుంటారు కొందరు. అందుకే.. వాష్‌రూమ్‌కు సైతం మొబైల్ తీసుకొనిపోతారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? అయితే.. మీ చేతులా కొన్ని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి వాష్‌రూమ్‌లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, జెర్మ్స్ వంటివి ఉంటాయి. అదే మీరు టాయిలెట్‌లో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న సాల్మోనెల్లా, ఇ-కొలి వంటి బ్యాక్టీరియాలు ఫోన్ మీదకు చేరి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఫోన్‌కి అతుక్కుపోయిన ఆ బ్యాక్టీరియా కారణంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు.
పైల్స్, మలబద్ధకం : మీరు టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు ఫోన్ వాడడం వల్ల దానిపై చేరే బ్యాక్టీరియా చేతులకు అంటుకొని అది కడుపులోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇది మిమ్మల్ని మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుందని నిపుణులంటున్నారు. అంతేకాదు.. మీరు వాష్‌రూమ్‌లో ఎక్కువసేపు ఫోన్‌ని ఉపయోగించడం వల్ల మీ విసర్జన అవయవాలపై అదనపు ఒత్తిడి పడుతుందట. ఇది పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశాలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2016లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. టాయిలెట్‌లో ఫోన్ ఎక్కువగా వాడే వ్యక్తులకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంటి సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అలెన్ బెర్మాన్ పాల్గొన్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు మొబైల్ వాడడం వల్ల పైల్స్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.