UNAIDS Report 2023 : ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 2023 సంవత్సరం ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. వీరిలో దాదాపు 90 లక్షల మంది తగిన చికిత్సను పొందలేకపోతున్నారని తెలిపింది. ఎయిడ్స్ సంబంధిత కారణాలతో ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున మరణిస్తున్నారని పేర్కొంది.
టార్గెట్ కంటే రెట్టింపే
2004లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 21 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. అయితే 2023లో దాదాపు 6.30 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత రుగ్మతలతో ప్రాణాలు విడిచారు. 2004 నాటితో పోలిస్తే ఎయిడ్స్ మరణాలు చాలావరకు తగ్గిపోయాయి. 2025 నాటికి ఎయిడ్స్ మరణాల సంఖ్యను 2.50 లక్షలకు తగ్గించాలనే ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం (యూఎన్ఎయిడ్స్) లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత నివేదికలు చూస్తే ఆ లక్ష్యం కంటే మరణాల సంఖ్య రెట్టింపుపైనే ఉందని ఐరాస విశ్లేషించింది. 2023 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీతో బాధపడుతున్న 3.99 కోట్ల మందిలో 86 శాతం మందికే తమకు ఎయిడ్స్ ప్రబలిందని, వారిలో 77 శాతం మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. చికిత్స పొందిన వారిలో దాదాపు 72 శాతం మందిలో హెచ్‌ఐవీ వైరస్ నిర్వీర్యం అయింది. సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకునే వ్యక్తులలో కొత్తగా ఎయిడ్స్ ఇన్ఫెక్షన్స్ నిర్ధరణ అయ్యే కేసులు 55 శాతానికి పెరిగాయి. 2010 నాటికి ఈ కేటగిరీల వారిలో 45 శాతం మందిలోనే కొత్త ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లు నిర్ధరణ అయ్యేవి. అంటే వీరిలో ఎయిడ్స్ కేసులు పెరిగాయని అర్థం.
ఆఫ్రికా మహిళలకు ముప్పు
ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణ చర్యల కోసం నిధులు తగ్గిపోతున్నాయని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో కొత్త అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించింది. లింగ అసమానతల వల్ల ఆఫ్రికా దేశాల్లో చాలామంది బాలికలు, మహిళలకు ఎయిడ్స్ సోకుతోంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులకు కూడా అత్యధిక హెచ్‌ఐవీ ముప్పు పొంచి ఉంటోందని ఐరాస తన నివేదికలో తెలిపింది.