తెలంగాణ

telangana

ETV Bharat / health

పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతోందా? - ఈ టిప్స్ పాటిస్తే ఏ రకం "బెల్లీ ఫ్యాట్"​ అయినా ఇట్టే తగ్గిపోతుందట! - HOW TO GET RID OF BELLY FAT

బెల్లీ ఫ్యాట్ ఆరోగ్యానికి హానికరం - ఇలా చేశారంటే ఎలాంటి పొట్టనైనా ఈజీగా తగ్గించుకోవచ్చంటున్న నిపుణులు!

HOW TO GET RID OF BELLY FAT
Tips to Reduce Belly Fat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 9:19 PM IST

Best Tips to Reduce Belly Fat : ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంటారు. అలాగే, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తినా, ఒత్తిడితోసతమతమైనా, డెలివరీ తర్వాత.. ఇలా వివిధ సందర్భాలలో పొట్ట పెరిగిపోవడం మన గమనిస్తూనే ఉంటాం. వాస్తవానికి ఇలా పెరిగిపోయిన పొట్టంటే ఎవరికీ నచ్చదు.

ఈ క్రమంలోనే చాలా మంది వెంటనే దీన్ని తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలని వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొందరిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. అలాకాకుండా మీకు వచ్చిన బెల్లీ ఫ్యాట్ రకాన్ని బట్టి కొన్ని టిప్స్ పాటిస్తే ఎలాంటి పొట్టనైనా ఈజీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డెలివరీ తర్వాత పొట్టను ఇలా తగ్గించుకోండి!

చాలా మంది మహిళల్లో డెలివరీ అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. దీంతో అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఈ క్రమంలోనే వెనువెంటనే పొట్ట తగ్గించుకొని తిరిగి నాజూగ్గా మారాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా జీవనశైలి, ఆహారపుటలవాట్లలో ఈ మార్పులు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మార్పు గమనించవచ్చంటున్నారు డాక్టర్ టి. లక్ష్మీకాంత్.

డెలివరీ అయ్యాక ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత గైనకాలజిస్ట్‌ సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు స్టార్ట్ చేయొచ్చు. ఈ క్రమంలో వాకింగ్, పాప లేదా బాబుని ఎత్తుకొని కాసేపు అటూ ఇటూ నడవడం, ధ్యానం, యోగా.. ఇలా కుట్లపై ఒత్తిడి పడని ఎక్సర్​సైజెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా కీగల్‌ వ్యాయామాలూ వదులైన చర్మం బిగుతుగా మారడానికి దోహదం చేస్తాయంటున్నారు. ఇక ఫుడ్ విషయానికొస్తే.. నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, ఆలివ్‌ నూనె, అవకాడో వంటి మంచి కొవ్వుల్ని డైట్​లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా నిపుణుల సలహా మేరకు పోస్ట్‌ పార్టమ్‌ స్లిమ్మింగ్‌ బెల్ట్‌, చీర చుట్టుకోవడం వంటివి ప్రయత్నించచ్చని సూచిస్తున్నారు.

అలా వచ్చే బెల్లీ ఫ్యాట్​ను ఇలా తగ్గించుకోండి!

కొందరికి శరీర పైభాగం స్లిమ్‌గా ఉండి.. పొట్ట దగ్గరికొచ్చేసరికి కాస్త లావుగా కనిపిస్తుంది. ఇందుకు రెండు కారణాలు ఉండవచ్చంటున్నారు డాక్టర్ టి. లక్ష్మీకాంత్. అందులో మొదటిది ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌-ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు అలవాటు పడడం వంటి వాటి వల్ల పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ఏర్పడుతుందంటున్నారు. ఇక రెండో కారణమేంటంటే జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వల్ల ఎప్పుడు చూసినా పొట్ట ఉబ్బరంగా కనిపిస్తుందంటున్నారు.

ఇలాంటి పొట్టను తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాలంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ టి. లక్ష్మీకాంత్. అందులో ముఖ్యంగా డైలీ డైట్​లో పీచు అధికంగా ఉండే బీన్స్‌, అవకాడో, బెర్రీ పండ్లు, బ్రకలీ, యాపిల్‌, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.

అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్‌ వ్యాయామాలు, బరువులు ఎత్తడం, మెట్లెక్కడం వంటివి సాధన చేసేలా చూసుకోవాలంటున్నారు. ఫలితంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు అక్కడి కండరాలు కూడా దృఢమవుతాయని సూచిస్తున్నారు.

బాణపొట్టతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ అలవాట్లు పాటిస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు!

ఒత్తిడి వల్ల ఏర్పడే పొట్టకు చెక్ పెట్టండిలా!

ఒత్తిడితో సతమతమయ్యేవారిలోనూ బెల్లీ ఫ్యాట్ సమస్య కనిపిస్తుందంటున్నారు డాక్టర్ లక్ష్మీకాంత్. అలాంటివారు ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం అవసరమంటున్నారు.

ముఖ్యంగా యోగా, ధ్యానం వంటివి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చాలా బాగా సహాయపడతాయంటున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా రాత్రిళ్లు నిద్ర మంచిగా పడుతుంది. ఫలితంగా బాడీ పునరుత్తేజితం అవుతుంది. అదేవిధంగా, అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉండే జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలను దూరం పెట్టి.. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ నిండి ఉన్న చేపలు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు.

ఇక వీటితో పాటు.. బరువుఎక్కువగా ఉన్న వారు, స్థూలకాయుల్లోనూ పొట్ట లావుగానే ఉంటుంది. అందుకే పొట్ట పెరిగిపోవడానికి కారణమేదైనా సరే.. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు పాటించడం, తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించడం, డైలీ వ్యాయామాలు చేయడం వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి త్వరగా విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు!

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డెలివరీ తర్వాత "బెల్టు" వాడితే పొట్ట తగ్గుతుందా? - వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ABOUT THE AUTHOR

...view details