Tips To Stop Hair Fall : బలమైన, పొడవైన జుట్టు కావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ దాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమైపోతారు. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య జట్టు రాలడం. మనం తినే ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, జీవన విధానం వంటి కారణాలేవైనా చాలామందికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది.
Home Remedies To Stop Hair Loss :కొత్తగా వెంట్రుకలు రాకున్నా పర్లేదు కానీ, ఉన్నవి ఊడిపోకుండా బలంగా ఉంటే చాలు దేవుడా అని అనుకునేవారు చాలామందే ఉంటారు. వెంట్రుకలు ఊడకుండా ఉండాలంటే హానికరమైన షాంపూలు, నూనెలకు దూరంగా ఉండటం ఒక మార్గమైతే మన ఇంట్లోనే సహజంగా దొరికే కొన్ని పదార్థాలను తలకు పట్టించడం మరో మార్గం. అలా సహజమైన పదార్థాలతో సులభంగా వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
సమతుల్య ఆహారం
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఊడిపోకుండా కాపాడటానికి ముందుగా మీరు చేయాల్సింది సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం. అంటే మీరు తినే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కెరాటిన్, విటమిన్-బీ7 లాంటి విటమిన్లు, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటితోపాటు వెంట్రుకల కణజాలం పెరుగుదలతో పాటు దృఢత్వంలో కోసం ఐరన్, జింక్ కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల పొడవైన బలమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
హెడ్ మసాజ్
ప్రతిరోజు కనీసం నాలుగు నిమిషాల పాటు జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. హెడ్ మసాజ్ అనేది హెయిర్ ఫోలీకల్స్కు రక్త ప్రసరణను పెంచుతుంది. కాలక్రమేణా వెంట్రుకలు మందంగా, బలంగా మారేందుకు సహాయపడుతుంది. మెరుగైన రక్తప్రసరణ వెంట్రుకల పెరుగుదలకు, కుదుళ్ల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కనీసం రోజుకు నాలుగు నిమిషాల పాటు గోరు వెచ్చటి నూనెతో మసాజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.
కలబంద
చాలారకాల అనారోగ్య సమస్యలను నయం చేయగల దివ్యౌషధం కలబంద. ఇది మన ఇంట్లోనే ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అనేకరకాల గాయాలు, ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలకు చక్కటి మందులా ఇది పనిచేస్తుంది. అలాగే మీ జుట్టుకు కూడా కలబంద చాలా మంచి పోషణనిస్తుంది. దీంట్లోని సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన వెంట్రుకల కారణంగా వచ్చే దురద, చమట కారణంగా కలిగే చికాకులను నుంచి ఉపశమనం కలిస్తుంది. అలాగే దీంట్లోని తేమ శాతం మీ పూర్తి తలకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, అందమైన వెంట్రుకలు మీ సొంతమవుతాయి.