Tips to Reduce Salt : "ఆహా ఏమి రుచి అనరా మైమరచి" అనాలంటే కూరలో ఉప్పు, కారం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎన్ని మసాలాలు ఉన్నా.. కూరలో ఉప్పు లేకపోతే సహించదు. అలాగని ఉప్పు రుచి కోసమేనా అంటే కాదనే చెప్పాలి. శరీరం నిర్వహించే రోజువారీ విధులకూ ఉప్పు అవసరమే. అందులోని సోడియం ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. నరాల ప్రేరణకీ, కండరాల సంకోచానికీ, కణాల్లో నీరు, ఖనిజాల సమతుల్యత కోసం.. శరీరానికి ప్రతిరోజూ 500 మి.గ్రా. సోడియం కావాలి.
అందుకే.. ఆరోగ్యవంతులు రోజుకు 2,300 మి.గ్రా. సోడియం క్లోరైడ్(ఉప్పు)ను తీసుకోవచ్చని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ చెబుతోంది. ఇది ఒక టీస్పూను(5గ్రా.) ఉప్పుతో సమానం. ఇంతకు మించి తింటే ముప్పు తప్పదు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). బీపీ ఉన్నవాళ్లయితే 1500 మిల్లీ గ్రాముల కన్నా తక్కువ తింటేనే మంచిదట. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, మెదడు లోపాలకు దారితీస్తుంది. అందువల్ల రోజువారీ దినచర్యలో ఉప్పు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
బ్రెడ్:చాలా మంది బ్రేక్‌ఫాస్ట్, ఇతర సమయాల్లో కూడా బ్రెడ్ తింటుంటారు. అయితే ఉప్పు తగ్గించుకోవాలనుకునేవారు బ్రెడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బ్రెడ్‌లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుందని తెలిపారు. ఒక్క బ్రెడ్ స్లైస్‌లో 400 మిల్లీ గ్రాముల ఉప్పు ఉంటుందని స్పష్టం చేశారు. అంతగా బ్రెడ్ తినాలనుకునేవారు ఉప్పు లేని బ్రెడ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
తక్కువ సోడియం:ఇది కూడా ముఖ్యమైనదే. బయట సూపర్ మార్కెట్స్‌లో కొనే ఫుడ్స్‌లో ఉప్పు శాతం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సోడియం అధికంగా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటిని కొనాలని సూచిస్తున్నారు.
మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవట!
సోయా:ఇందులో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల సోయాలో 5.7 గ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎక్కువ శాతం ఉప్పుతో కూడిన సాస్ మరియు చాలా మితమైన పరిమాణంలో తీసుకోవాలి.
ఉప్పు లేకుండా వంట చేయడం:కూరల్లో ఉప్పు లేకపోతే అది రుచిగా ఉండదు. అయినప్పటికీ ఉప్పు లేకుండా లేదా చాలా తక్కువ ఉప్పుతో వంటలు వండడానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు. అయితే ఇది ఒక్కసారికే అలవాటు కాదు. కాబట్టి ఉప్పు మోతాదును తగ్గించుకుంటూ పోతే.. చివరకు ఉప్పు లేకుండా వంట వండుకోవచ్చు.
ప్రాసెస్ ఆహారాలు వద్దు:ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్ ఫుడ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎప్పటికీ. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఎంత ఉప్పు వేస్తున్నారో తెలియదు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా ఇతర రసాయనాలు కూడా కలుపుతారు. అందువల్ల కూడా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.