Tips to Make Soft Jowar Roti :జొన్న రొట్టెలకు గిరాకీ ఎంతగా ఉందో.. సాయంత్రం వేళ సందుల్లో ఉండే తోపుడు బండ్లను చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో.. వాటిని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఇంట్లో చేయడం మాత్రం చాలా మందికి రాదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. జొన్నరొట్టెను సాఫ్ట్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- జొన్నపిండి- 1 కప్పు
- వేడినీరు- అరకప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- నెయ్యి- కావాల్సినంత
తయారీ విధానం:
- ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో జొన్నపిండి, ఉప్పు, వేడి నీరు పోసుకుని.. స్పూన్ సాయంతో కలుపుకుని మూత పెట్టి ఓ 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత పిండిని ముద్దగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి జిగటగా ఉంటే మరికొంచెం జొన్నపిండిని కలపాలి. అలాకాకుండా పిండి గట్టిగా ఉంటే చేతులు కొంచెం తడి చేసుకుని పిండిని కలపాలి.
- ఇప్పుడు కలిపిన పిండిని చపాతి పీట లేదా చపాతి చేసే బండ మీద పెట్టి.. పిండిని బాగా సాగదీస్తూ కలుపుకోవాలి.
- మధ్యలో కొంచెం పొడి పిండి వేసుకుని బాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి సాఫ్ట్‌గా మారుతుంది. ఈ ప్రక్రియ అస్సలు మర్చిపోవద్దు.
- ఇప్పుడు పిండిని సమాన భాగాలు చేస్తూ ఉండలు చేసుకోవాలి. అందులో ఒక ఉండ తీసుకుని మిగిలిన వాటిని ఓ గిన్నెలో వేసి మూతపెట్టి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు చపాతి పీట మీద ఉండ పెట్టి.. మరో 40 సెకన్ల పాటు స్ట్రెచ్ చెయ్యాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చాలా జాగ్రత్తగా రొట్టెలు షేప్‌లో చేసుకోవాలి. ప్రెషర్ పెట్టి రుద్దడం వల్ల పిండి మధ్యలోకి విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సున్నితంగా రుద్దుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టి ఫ్లేమ్‌ను మీడియంలో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఇప్పుడు వెంటనే కాల్చిన రొట్టెలకు రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుని స్టోర్ చేసుకోవాలి. అంతే ఎంతో సాఫ్ట్‌గా ఉండే జొన్నరొట్టెలు రెడీ..