These Gym Mistakes Could Cause Death :శరీర బరువును తగ్గించడానికి, కండరాలను దృఢంగా మార్చడానికి, ఇమ్యూనిటీ పవర్‌ను వృద్ధి చేయడానికి వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తుంటారు. మరికొందరు జిమ్‌కు వెళ్తుంటారు. ముఖ్యంగా యువత మంచి శరీర సౌష్టవం పొందడానికి వ్యాయామశాలల్లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. వారిలా మీకూ జిమ్‌కు వెళ్లే అలవాటు ఉందా? అయితే,జిమ్‌లో(Gym) ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. ఎందుకంటే.. ఆ తప్పులను పదేపదే చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, జిమ్‌లో చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వార్మ్-అప్, కూల్-డౌన్ :చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. తొందరగా వర్కౌట్స్ అయిపోవాలని వార్మ్-అప్, కూల్-డౌన్‌ను స్కిప్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. వర్కౌట్స్ ముందు చేసే వార్మ్-అప్.. శరీర ఉష్ణోగ్రతను పెంచి మజిల్స్‌ను వ్యాయామం కోసం రెడీ చేస్తుంది. అదే.. వర్కౌట్స్ తర్వాత చేసే కూల్-డౌన్ హార్ట్ బీట్ రేటును క్రమంగా తగ్గించి శరీరాన్ని రిలాక్స్ స్థితికి రావడానికి తోడ్పడుతుంది. ఇవి రెండూ మీ గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
సామర్థ్యానికి మించిన వర్కౌట్స్ చేయడం : జిమ్‌కు వెళ్లే చాలా మంది చేసే మరో మిస్టేక్ ఏంటంటే.. త్వరగా కండలు పెరగాలనో, తొందరగా బరువు తగ్గాలనో తమ కెపాసిటీకి మించి వర్కౌట్స్ చేస్తుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందంటున్నారు నిపుణులు. మీరు సామర్థ్యానికి మించి జిమ్‌లో అధిక బరువులు ఎత్తడం, ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం వంటివి చేయడం గుండెపై ఆకస్మిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు వేగంగా పెరుగుతాయి. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2017లో 'హార్ట్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. జిమ్‌లో సామర్థ్యానికి మించి వ్యాయామం చేసే వ్యక్తులలో అకాల మరణానికి దారితీసే అకస్మాత్తు గుండెపోటు రావడానికి నాలుగు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ Anders Grønning పాల్గొన్నారు. జిమ్‌లో తమ సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.