Symptoms Of Lung Cancer :అన్నం తినకుండా కొన్ని రోజుల వరకు ఉండగలం.. నీళ్లు తాగకుండా కూడా కొంత సేపు ఉండవచ్చు. కానీ.. ఊపిరి తీసుకోక పోతే మాత్రం నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. మన శరీరానికి గాలి అంతగా అవసరం. ఆ గాలిని పంప్ చేసే అత్యంత ముఖ్యమైన భాగాలుగా ఊపిరితిత్తులు ఉన్నాయి. కానీ.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పొగ తాగడం వంటి అలవాట్ల వల్ల నేడు చాలా మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ తరవాత ఎక్కువ మంది చనిపోయేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ బారిన పడ్డ వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితోపాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. మరి.. లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్ బారిన పడ్డ వారిలో దగ్గుతున్నప్పుడు ఛాతి భాగంలో నొప్పి కలుగుతుందని యూకేకు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. అలాగే భుజాలు కూడా నొప్పిగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా.. కఫం సమస్యలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, లంగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
లంగ్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మరికొన్ని లక్షణాలు..
- తరచూ అలసటకు గురికావడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- వేగంగా బరువు తగ్గడం
- లంగ్ ఇన్ఫెక్షన్లు రావడం
- కొందరిలో గొంతు బొంగురుపోవడం
- విపరీతమైన దగ్గు
- ఆకలి లేకపోవడం
- తీవ్రమైన భుజాల నొప్పులు