Summer Effect On BP And Diabetes Patients :అధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుల్లో షుగర్, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులతో పోలిస్తే ఆస్పత్రిలో చేరే ప్రమాదం రెట్టింపు అవుతుందని స్పానిష్ అధ్యయనంలో తేలింది. స్పెయిన్‌లో ఒక దశాబ్దానికి పైగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఆస్పత్రిలో చేరిన రోగుల డేటాను విశ్లేషించి ఈ అధ్యయనం పలు విషయాలను వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు షుగర్, బీపీ, ఒబెసిటీతో బాధపడేవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది.
"ఊబకాయం ఉన్నవారు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక స్థాయి వాయు కాలుష్యం మధుమేహం సహా పలు వ్యాధిగ్రస్థులను ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. వేడిగా ఉండే రోజుల్లో గాయాల కారణంగా పురుషులు ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాగా, మహిళలు అంటు వ్యాధులు, హార్మోన్లు, జీవక్రియ, శ్వాసకోశ, మూత్ర సంబంధిత వ్యాధుల వల్ల ఎక్కువగా ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగిన రోజుల్లో శరీరంలో ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. దీంతో చెమట పెరుగుతుంది. అలాగే సాధారణ రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు షుగర్, బీపీ, ఒబెసిటీ వ్యాధిగ్రస్తులు కాస్త ఇబ్బందులు పడతారు" ఆని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన పరిశోధకుడు హిచమ్ అచె బాక్ పేర్కొన్నారు.
రోగుల డేటా విశ్లేషణ
స్పెయిన్‌లోని 48 ప్రావిన్సులు, తూర్పు స్పెయిన్‌లోని ద్వీపసమూహంలోని ఆస్పత్రుల్లో 2006- 2019 మధ్య చికిత్స పొందిన 11.2 మిలియన్లకు పైగా (కోటి పన్నెండు లక్షలు) రోగుల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించింది. వేసవి (జూన్- సెప్టెంబరు)లో ప్రజలు ఆస్పత్రుల్లో చేరడానికి గల కారణాలపై అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రతలు వీరి ఆరోగ్యంపై ఏ మేర ప్రభావం చూపాయో అంచనా వేసింది. అలాగే వాయు కాలుష్య స్థాయిలతో పాటు రోజువారీ సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంది.