These Foods Can Increase Stress Levels : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని భారం, నిద్రలేమి వల్ల చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవేకాకుండా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా శరీరం ఒత్తిడికి లోనవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ స్ట్రెస్‌ను((Stress)పెంచే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చక్కెర పదార్థాలు :చక్కెరతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి. ఫలితంగా ఒత్తిడి, చిరాకు వంటివి కలుగుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి చక్కెరతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోకుండా.. వాటికి బదులుగా పండ్లు, తేనె వంటి సహాజ పదార్థాలను తీసుకోవడం మంచిది అంటున్నారు. ఎందుకంటే.. ఇవి తీపి తినాలనే కోరికను అదుపు చేయడంలో సహాయపడతాయంటున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ :ఒత్తిడితో చిత్తవ్వకూడదంటే ప్రిజర్వేటివ్స్ కలిపి ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. అలాగే దీనిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వులు కూడా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి చిప్స్ వంటి ఇతరత్రా ఫ్రైడ్ స్నాక్స్‌కి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.
ఫ్రైడ్ ఫుడ్స్ :ఈ ఫుడ్స్ కూడా ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఫ్రై చేసిన ఆహారంలో ఎక్కువ శాతంలో కొవ్వు ఉంటుంది. దాంతో అలాంటివి తినడం వల్ల బాడీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని గ్రహించకుండా అడ్డుపడతాయి. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ :ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిస్ అదుపులో ఉంటుందనే ఉద్దేశంతో తీపి పదార్థాలకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ, ఇవి కూడా స్ట్రెస్ లెవల్స్ పెంచడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇవి తీసుకోవడం వల్ల తెలియకుండానే చిరాకు, ఒత్తిడితో పాటు దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
2019లో 'అపెటైట్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కృత్రిమ స్వీటెనర్‌లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బెంజమిన్ యాంగ్ పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతాయని ఆయన పేర్కొన్నారు.