Skip Meals Side Effects In Telugu :ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గాలని సరిగ్గా ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరి కొందరైతే పనుల్లో పడి తినడానికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ఇక ఇంట్లోని మహిళల విషయానికొస్తే పిల్లల్ని స్కూల్‌కు పంపే హడావిడిలో పడి బ్రేక్‌ఫాస్ట్ చేయడమే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని నేరుగా లంచ్ చేసేస్తున్నారు. ఇలా భోజనం మానేయడం, వేళకు తినకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా భోజనాన్ని సమయానికి తినకపోవడం, స్కిప్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఓ సారి తెలుసుకుందాం.
సమయానికి తిండి తినకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీని వల్ల శరీర అవయవాల పని తీరు నెమ్మదిస్తుంది. భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. తద్వారా మన శరీరం నీరసంగా, అలసటగా ఉంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత సైతం లోపిస్తుంది. అందుకే సమయానికి తినడం, అన్ని పూటలూ ఆహారం తీసుకోవడం ముఖ్యమని పోషాకాహార నిపుణులు సూచిస్తున్నారు.
'జీవక్రియల వేగం తగ్గుతుంది'
పదే పదే భోజనం మానేయడం వల్ల శరీరం శక్తిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల జీవక్రియల వేగం తగ్గుతుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రికి ఎక్కువగా ఆహరం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని వల్ల ఇన్సులిన్ స్పందించే వేగం తగ్గిపోతుంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్త్‌లో మధుమేహానికి గురయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ భోజనం మానేసే వాళ్లలో విటమిన్ లోపాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.