తెలంగాణ

telangana

ETV Bharat / health

దాంపత్యంలో ఈ ప్రవర్తన - ఇంకా మెచ్యూరిటీ రాలేదన్నమాట!

Relations Ship Tips : కొందరి దాంపత్యం సముద్రంపై ప్రశాంతంగా ప్రయాణిస్తున్న నావలా ఉంటుంది. మరికొందరి సంసారం తుఫానులో చిక్కుకున్న పడవలా తయారవుతుంది! ఈ రెండో తరహా పరిస్థితికి.. మెచ్యూరిటీ లేకపోవడమే కారణని అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారు ఎలా బిహేవ్ చేస్తారు? దాన్ని ఎలా సరిచేసుకోవాలి? అన్నది చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 3:25 PM IST

Updated : Jan 29, 2024, 3:44 PM IST

Signs That Tells You Being Immature During Conflicts
Signs That Tells You Being Immature During Conflicts

Relations Ship Tips :అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇది జీవితాంతం కొనసాగితేనే వారి సంసార జీవితం నిండు నూరేళ్లూ పచ్చగా ఉంటుంది. కానీ.. ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్తల మధ్యగొడవలుజరగడం అత్యంత సహజం. అయితే.. ఈ వివాదాల సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదాన్నిబట్టే.. ఆ గొడవ టీకప్పులో తుఫానులా చల్లారిపోతుందా? చినికి చినికి గాలివానలా మారుతుందా? అన్నది ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రవర్తనే మీ మెచ్యూరిటీ స్థాయిని నిర్ధారిస్తుందని అంటున్నారు.

భాగస్వామిని నిందించడం..
తప్పులనేవి అందరూ చేస్తారు. కానీ.. కొంత మంది తాము ఎప్పుడూ కరెక్టే అనుకుంటారు. తన పార్ట్​నరే ప్రతిసారీ తప్పు చేస్తుంటారనే భావనలో ఉంటారు. అంతేకాదు.. ఏమాత్రం అవకాశం చిక్కినా.. భాగస్వామి గతంలో చేసిన తప్పులను తవ్వి పదే పదే నిందిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏంటనే ఆలోచన కూడా చేయరు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల గొడవ ఇంకా పెద్దది అవుతుందే తప్ప.. సమస్య పరిష్కారం జరగదని నిపుణులు చెబుతున్నారు. ఇలా అర్థం చేసుకోకుండా.. ప్రతిసారీ భాగస్వామిని నిందించేవారిలో మెచ్యూరిటీ లెవెల్స్‌ తక్కువగా ఉన్నట్లేనని అంటున్నారు. తప్పులు మీరు కూడా చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని.. ఎదుటివారిని క్షమించే మనస్తత్వం అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.

సహనం కోల్పోవడం..
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలనేవి సహజం. ఈ గొడవలు జరిగేటప్పుడు కొంత మంది సహనం కోల్పోయి, తమ భాగస్వామిని దూషించడం.. కొట్టడం వంటివి చేస్తుంటారు. సహనం కోల్పోయి.. ఇలా రూడ్​గా బిహేవ్ చేయడం పరిపక్వత లేకపోవడానికి నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలని సూచిస్తున్నారు. గొడవ మరీ పెద్దది అయితే.. అక్కడి నుంచి లేచి వేరే రూమ్‌లోకి వెళ్లిపోవడం.. లేదా కాసేపు బయట కూర్చోవడం వంటివి చేయాలని చెబుతున్నారు. దానివల్ల భావోద్వేగాలు తగ్గుతాయని.. గొడవ మరింత పెరగకుండా ఉంటుందని సూచిస్తున్నారు. కోపం తగ్గిన తర్వాత కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవాలని చెబుతున్నారు.

వాదించడం..
కొంత మంది ఎంత సేపూ తమ మాటే నెగ్గాలని అవతలి వ్యక్తి నోరు మూయించే ప్రయత్నం చేస్తుంటారు. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో సరిగా వినరు. చర్చ వదిలేసి.. మాటల యుద్ధానికి దిగుతారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ ప్రవర్తన కూడా మెచ్యూరిటీ లేకవడానికి నిదర్శనం. ఈ తరహా ప్రవర్తనవల్ల.. బంధం దెబ్బతింటుందే తప్ప, ఎలాంటి ఉపయోగమూ లేదని చెబుతున్నారు. ఎక్కువగా వాదనకు దిగడం వల్ల భాగస్వాముల మధ్య ప్రేమ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడం..
గొడవలు జరుగుతుంటాయి.. సమస్యలు వస్తుంటాయి. అందుకు పరిష్కార మార్గాలు వెతక్కుండా.. ఎంతసేపూ దానికి కారణం నువ్వంటే నువ్వంటూ తిట్టుకుంటూ ఉండడం కూడా మానసిక అపరిపక్వతకు సంకేతం. ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుగా దానికి పరిష్కార మార్గం వెతకాలి. దాన్ని సాల్వ్ చేసిన తర్వాత.. ఎందుకిలా జరిగింది? మళ్లీ జరగకుండా ఏం చేయాలి? అన్నది డిస్కస్ చేసుకోవాలి. అంతేకానీ.. ఇది వదిలేసి సమస్యకు నువ్వే కారణమంటూ నిందించుకోవడం వల్ల ఉపయోగం సున్నా అని చెబుతున్నారు.

చివరిగా..
బంధం ఏదైనా కలకాలం పదిలంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య ఉండాల్సింది ప్రేమ. అదే.. వారిని అన్యోన్యంగా ఉంచుతుంది. అలా కాకుండా.. ఎప్పుడైతే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారో.. అప్పటి నుంచే వారి బంధం బీటలు వారడం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు.

అలర్ట్ : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?

ఉదయాన్నే ఈ అలవాట్లను పాటిస్తే - మీరు 100 ఏళ్లు జీవించడం ఖాయం!

మీ పార్ట్​నర్​తో గొడవ పడినప్పుడు ఈ మాటలు అంటున్నారా? - అయితే విడాకులు ఖాయం!

Last Updated : Jan 29, 2024, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details