Donors Helping Youth For Competitive Exams : ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. అన్ని వసతులున్న నగరాల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటిది పల్లెల్లో వారి సమస్యలు వర్ణనాతీతం. గ్రంథాలయాలున్నా అరకొర వసతులు, లేదంటే బాగానే ఉన్నా పుస్తకాల కొరత, ఇలా ఏదో ఒకటి వారిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అలాంటి సమస్యలు ఎదురు కావొద్దంటూ కొంతమంది దాతలు సేవలందిస్తున్నారు. ఎంతో మంది తమ జీవితాల్లో స్థిరపడటానికి తోడ్పతున్నారు. మన దగ్గర ఉన్న అలాంటి గ్రంథాలయాలు? వాటి ప్రత్యేకథలు ఇప్పుడు చూద్దాం.
గ్రామానికి ఏదో చేయాలని : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రభుత్వ పాఠశాలలో 1983లో పదో తరగతి పాసైన కొందరు పూర్వ విద్యార్థులు తమ గ్రామం కోసం తమవంతుగా ఏదైనా చేయాలి అనుకున్నారు. వృత్తిరీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడ్డా, గ్రామం బాగు కోరుకునే వీరంతా 2001 నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 2015లో లైబ్రరీని ఏర్పాటు చేసి, కొంతకాలానికి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్రామం, చుట్టుపక్కల ఊళ్లకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల శిక్షణ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పటడం, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడం గమనించారు గ్రంథాలయ కమిటీ సభ్యులు.
ఇక్కడ చదువుకుని 25 మంది ఉద్యోగం సాధించారు : అందుకే అక్కడ ఉచితంగా కంప్యూటర్ క్లాస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సివిల్స్, గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఎల్‌ఐసీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గైడెన్స్, శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. అక్కడికొచ్చే పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రోజుకో గెస్ట్ ఫ్యాకల్టీని పిలిపించి క్లాసులు చెప్పిస్తుంటారు. స్కూలు, కాలేజీ విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తుంటారు. పోలీస్, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిని ప్రోత్సహించడం కోసం ఆటల పోటీలనూ ఏర్పాటు చేస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో చదువుకున్న వారిలో దాదాపు పాతిక మంది వివిధ పోటీ పరీక్షలు రాసి, ప్రభుత్వ ఉద్యోగాల్ని సొంతం చేసుకున్నారంటే ఎంతో గొప్ప విషయం కదూ.
ఆకలితో విద్యార్థులు చదవకూడదని : నల్గొండ పట్టణంలో ఉన్న పబ్లిక్ లైబ్రరీ చాలా పెద్దది. వేల పుస్తకాలున్న ఈ గ్రంథాలయంలో చదువుకోవడానికి విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారూ వస్తుంటారు. రోజూ అక్కడికి దాదాపు నాలుగు వందల మంది వస్తుంటారు. వారితో లైబ్రరీ కిటకిటలాడుతోంది. అయితే చాలా మంది చుట్టుపక్కల విద్యార్థులే అక్కడ చదువుకుంటున్నారు. ఎక్కువ సమయం చదువుకోవాలనే ఉద్దేశంతో ఉదయాన్నే వచ్చే ఆ విద్యార్థులు, వెంట భోజనం తెచ్చుకోలేని పరిస్థితి. రోజూ బయట తినడమంటే ఆర్థికంగా భారమవుతుంది.
ఒకప్పుడు విద్యార్థులు అలానే చదువుకునేవారు. కానీ అలా ఆకలి వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టలేరని అర్థం చేసుకుంది స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతీక్ ఫౌండేషన్. ఆ సంస్థ గ్రంథాలయానికి ఎన్నో వసతులు సమకూర్చింది. అప్పుడే అక్కడకు వస్తున్న విద్యార్థులు ఆకలితో చదువుతున్న విషయం గ్రహించి, వారి ఆకలిని తీర్చాలనుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు మూడొందల మందికి కడుపు నిండా భోజనం వడ్డిస్తోంది. అంతేకాకుండా పోటీ పరీక్షల కోసం కష్టపడే వారికి ఏవైనా పుస్తకాలు కావాల్సి వస్తే వాటిని కూడా సమకూరుస్తున్నారు.