Challa Mirapakayalu in Telugu: తెలుగు సంప్రదాయ వంటకాల్లో ఊర మిరపకాయలు ఒకటి. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంలో వీటిని ఎక్కువగా చేసేవాళ్లు. వీటిని మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అని కూడా పిలుస్తుంటారు. సాంబారు, పప్పన్నం, పెరుగు అన్నం, పప్పుచారులో సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటాయి. కాస్త కారంగా భలే రుచిగా ఉండే వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అయితే, సాధారణంగా చల్ల మిరపకాయలను పెరుగులో నానబెట్టుకుని ఐదు రోజుల పాటు ఊరబెట్టుకుంటారు. ఇదంతా కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు మనం.. ఎలాంటి పెరుగు, మజ్జిగ లేకుండా కేవలం ఒక్కరోజులోనే చల్ల మిరపకాయలను చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- అర కిలో పచ్చిమిరపకాయలు (ముదిరినవి)
- 30 గ్రాముల వాము పొడి
- పావు కప్పు ఉప్పు
- ఒక నిమ్మకాయ రసం
- నూనె
తయారీ విధానం
- ముందుగా పచ్చిమిరపకాయలను తీసుకుని తొడిమలు తీయకుండానే శుభ్రంగా నీటిలో కడిగి జాలి గిన్నెలో వేసుకోవాలి.
- ఆ తర్వాత ఓ క్లాత్‌పై వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోని తొడిమలు తీసేసుకోవాలి. (కేవలం ఫ్యాన్ గాలికి మాత్రమే పెట్టాలి. ఎండలో పెట్టకూడదు)
- అనంతరం వీటిని మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి.
- ఇప్పుడు ఇందులోనే వాము పొడి, పావు కప్పు ఉప్పు, నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలపి గంటపాటు పక్కకు పెట్టుకోవాలి. (కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి)
- ఆ తర్వాత వీటిని మరోసారి బాగా కలిపి మరో గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఒక రోజు మొత్తం ఊరబెట్టుకోవాలి. (మధ్యమధ్యలో 8 గంటలకు ఒకసారి కలుపుకొంటే అన్ని బాగా ఊరతాయి)
- 24 గంటల తర్వాత వాటిని ఓ క్లాత్‌పై పలుచగా వేసుకుని ఎండకు ఆరబెట్టుకోవాలి.
- ఇదే విధంగా ఇవి బాగా కరకరలాడే వరకు సుమారు 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి.
- బాగా ఎండిన తర్వాత స్టౌ ఆన్ చేసి నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. (మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలి)
- ఇప్పుడు ఎండబెట్టిన మిరపకాయలను నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే టేస్టీ ఊర మిరపకాయలు రెడీ!