Pulihora Pulusu Recipe : దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అయితే, నవరాత్రుల సమయంలో ఎక్కువ మంది ఆ జగదాంబకు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ పులిహోరలో చింతపండు పులిహోర చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ దేవి నవరాత్రుల్లో చాలా ఈజీగా టేస్టీగా చింతపండు పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా పులిహోర ప్రిపేర్ చేసి పెట్టుకుంటే.. ఉదయాన్నే నైవేద్యంగా పులిహోర ఎంతో సులభంగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర పులుసు ఎలా చేయాలో మీరు చూడండి..
కావాల్సిన పదార్థాలు..
- చింతపండు- 250 గ్రాములు
- పసుపు- టీస్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- కరివేపాకు రెబ్బలు- 4
- పచ్చిమిర్చి- 10
- మిరియాలు -టీస్పూన్
- పసుపు-టీస్పూన్
- ఆయిల్-కప్పు
- నీళ్లు
- బెల్లం-పావుకప్పు
పులిహోర పొడి కోసం..
మెంతులు- అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
ధనియాలు-2 టేబుల్‌స్పూన్లు
జీలకర్ర- అరటీస్పూన్
నువ్వులు-టీస్పూన్
మిరియాలు -అరటీస్పూన్
ఎండుమిర్చి- 4
తాలింపు కోసం :
పల్లీలు-కప్పు
మినప్పప్పు-2 టేబుల్‌స్పూన్లు
శనగపప్పు- 2 టేబుల్‌స్పూన్లు
మిరియాలు-టీస్పూన్
ఆవాలు-టీస్పూన్
ఎండుమిర్చి- 10
కరివేపాకు- రెండు రెబ్బలు
ఇంగువ - అరటీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా చింతపండుని అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి.
- తర్వాత స్టౌపై నానబెట్టుకున్న చింతపండు గిన్నె పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసుకుని చింతపండు రసం పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఈ చింతపండు రసం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జల్లెడ గిన్నెలో వేసుకుని గుజ్జు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఈజీగా ఫిల్టర్ కావడానికి మధ్యమధ్యలో కొన్ని నీళ్లను పోసుకుంటూ గరిటెతో ప్రెస్ చేయాలి.
- తర్వాత చింతపండు గుజ్జులో కరివేపాకులు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాలు, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి మరొసారి కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని సన్నని మంట మీద చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి.
- చింతపండు రసంలో ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు పులిహోర పులుసు కోసం ఒక స్పెషల్ పొడి సిద్ధం చేసుకుందాం. స్టౌపై పాన్ పెట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పులిహోర పులుసులో ఈ పొడి వేయడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుంది.
- ఇప్పుడు పాన్లో కప్పు ఆయిల్ వేసి పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేయండి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసుకుని పులిహోర పులుసు పోసుకుని కలుపుకోవాలి. మీరు ముందుగా పులిహోర పులుసు సరిగా ఉడికించుకోకపోతే కొద్దిసేపు ఉడికించుకోండి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న పులిహోర పొడి కలుపుకోండి. అలాగే కొద్దిగా బెల్లం పొడి కలుపుకోండి.
- అంతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ పులిహోర పులుసు రెడీ. దీనితో మీరు ఈజీగా అప్పటికప్పుడు ఎప్పుడైనా ప్రసాదం పులిహోర తయారు చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా నవరాత్రులలో ఈ రెసిపీ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
దేవీ శరన్నవరాత్రులు : అమ్మవారు మెచ్చే "శాఖాన్నం, లౌకీ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!