Sri Lanka Cricket Rising : ఒకప్పుడు ఏ ప్రధాన ఐసీసీ టోర్నీ జరిగినా శ్రీలంక జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉండేది. కానీ, దిగ్గజాలు కుమార సంగక్కర, మహేల జయవర్దనే, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండీస్, లసిత్ మలింగ రిటైర్మెంట్ అనంతరం లంక క్రమంగా వైభవం కోల్పోయింది. స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్ కావడం వల్ల జట్టు బలహీన పడింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్‌లు అంచనాలకు తగినట్లు రాణించలేకపోయారు.
జట్టులో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించేది. వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ దాటడం కూడా కష్టమైపోయింది. గత కొన్నేళ్లుగా ఇదే తంతు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక మళ్లీ బలపడుతోంది. కొన్నేళ్లుగా చిన్న టీమ్‌లపై కూడా గెలవడానికి చెమటోడ్చిన లంక, ఇప్పుడు బలమైన జట్లకు షాక్ ఇస్తోంది. కొన్ని నెలల్లోనే వరుసగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌పై సంచలన విజయాలు అందుకుంది.
27 ఏళ్ల తర్వాత భారత్‌పై
2024 ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్, శ్రీలంకలో పర్యటించింది. శ్రీలంక స్పిన్‌ని ఎదుర్కోలేక భారత్ సిరీస్ కోల్పోయింది. మొదటి మ్యాచ్ డ్రా కాగా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయం సాధించింది. దీంతో టీమ్‌ఇండియాపై శ్రీలంక ఏకంగా 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు విజయం
ఆగస్టు, సెప్టెంబర్‌లో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. శ్రీలంక 2-0తో సిరీస్ కోల్పోయింది. అయితే నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక బలంగా పుంజుకొంది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం అందుకొంది. దశాబ్దం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై శ్రీలంక విజయం రుచి చూసింది.
న్యూజిలాండ్‌పై సత్తా
ఇటీవల సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో 63 పరుగులు, రెండో టెస్టులో ఇన్నింగ్స్, 154 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్‌పై దాదాపు 15 సంవత్సరాల తర్వాత శ్రీలంక సిరీస్ గెలిచింది.
WTC ఫైనల్ రేస్‌లోకి
ఇక న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్ పాయింట్ల శాతాన్ని కూడా శ్రీలంక మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌కు ముందు 49.9 గెలుపు శాతంతో ఐదో స్థానంలో ఉన్న లంక, కివీస్‌పై క్లీన్‌స్వీప్‌తో 55.56 శాతానికి చేరి మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో భారత్, ఆస్ట్రేలియాతో పాటు డబ్ల్య్టూసీ ఫైనల్ రేస్‌లోకి వచ్చింది. ఈ సీజన్లో లంకకు వరుసగా ఇది మూడో విజయం. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో లంక ఐదింట్లో నెగ్గింది.
A momentous occasion in Galle! 🇱🇰 Kusal Mendis' magnificent hundred in the second Test makes Sri Lanka one of the rare Test XIs to feature five players with 10 or more Test centuries. 🏏
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 30, 2024
A testament to the rich batting legacy of our island nation! #SriLankaCricket #TestCricket pic.twitter.com/1dnXTW7MqP
కివీస్‌ను చిత్తు చేసిన లంక - 15ఏళ్లలో తొలిసారి సిరీస్ కైవసం - NZ vs SL Test Series 2024