Reasons for Low BP : ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే, జనాలు హైబీపీ గురించి విన్నంతగా.. లో-బీపీ గురించి విని ఉండరు. అంతేకాదు.. ఆడవారిలోనే లో-బీపీ సమస్య అధికంగా కనిపిస్తుంది.
ఈ సమస్యతో బాధపడేవారు రోజంతా చాలా బలహీనంగా ఉంటారు. ఉదయం పూట ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడప్పుడూ తల తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. దీంతో.. తమకు ఏం జరుగుతోందో అని భయపడిపోతుంటారు. మరి.. హఠాత్తుగా బీపీ పడిపోవటానికి గల కారణాలేంటి అనే ప్రశ్నకు.. ప్రముఖ కార్డియాలజిస్ట్ 'డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి' సమాధానమిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
ప్రధాన కారణాలు ఇవే..
- అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా దీర్ఘకాలంగా రక్తపోటు పడిపోవటానికి అవకాశం ఉంది. అడ్రినల్ గ్రంథి కార్టికో, మినెరలో కార్టికో స్టిరాయిడ్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి మోతాదులు తగ్గితే బీపీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది.
- పరగడుపున కార్టిజాల్ టెస్ట్ చేసుకుంటే.. అడ్రినల్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు.
- శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు తగ్గినా బీపీ పడిపోతుంది.
- కొందరిలో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు రక్తపోటు మామూలుగా లేదా ఎక్కువగా ఉంటుంది. కానీ, లేచి నిల్చున్నప్పుడు రక్తపోటు పడిపోతుంది. ఇలాంటి పరిస్థితికి కారణం స్వయం చాలిత నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడమే.
- అలాగే ధమనుల్లో పూడికలుంటే ఒక చేతిలో బీపీని పరీక్షిస్తే ఎక్కువగా, మరో చేతిలో పరీక్షిస్తే మామూలుగా ఉండొచ్చు. ఇలా లో-బీపీ రావడానికి వివిధ కారణాలుంటాయని డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి చెబుతున్నారు.
- అయితే.. ఈ సమస్యతో బాధపడేవారు గుండె నిపుణులను గానీ జనరల్ ఫిజిషియన్‌ను గానీ సంప్రదిస్తే కారణమేంటన్నది పరిశీలిస్తారు. వారి సూచనలకు అనుగుణంగా చికిత్స చేయించుకోవాలి అని కృష్ణారెడ్డి సూచిస్తున్నారు.
టెస్ట్ సరిగా చేసుకోవాలి..
సాధారణంగా గుండెజబ్బులతో బాధపడేవారిలో బీపీ పడిపోతుంటుంది. కానీ, ఇలా బీపీ తగ్గిపోవడానికి చాలా తక్కువ కారణాలుంటాయి. అయితే.. లో-బీపీతో బాధపడేవారు బీపీ సరిగ్గా చూపించుకుంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి. డిజిటల్ పరికరంతో రక్తపోటును పరీక్షించుకుంటున్నట్టయితే.. హాస్పిటల్లో వాడే బీపీ పరికరం (మానోమీటర్)తో పోల్చి చూసుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకుంటే.. రిజల్ట్ కచ్చితంగా ఉందో లేదో బయటపడుతుంది అని సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రక్తపోటు తక్కువగా ఉంటే ఏమవుతుంది? - నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
క్లారిటీ: బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? - తగ్గడానికి ఏం చేయాలి? - నిపుణుల ఆన్సర్ ఇదే!